మరోసారి జాకీచాన్ ను వార్తల్లో చంపేశారు

మరోసారి జాకీచాన్ ను వార్తల్లో చంపేశారు

పేరు ప్రఖ్యాతులున్న సినీ నటులకు ఈ మధ్యన పెద్ద కష్టమే వచ్చి పడుతోంది.వారికున్న ఫేమ్ పుణ్యమా అని వారికి సంబంధించిన వార్తల్ని అందించే విషయంలో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం వారికి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మన దగ్గర వార్తా సంస్థల మధ్య పోటీ ఎలా తగలబడి చచ్చిందో ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి.

ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగిన నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా.. అందరికి అన్ని విషయాలు తెలిసిపోయే పరిస్థితి. అయితే.. తమకొచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునే విషయంలో మీడియా సంస్థలు సంయమనం పాటించే విషయంలో ఫెయిల్ కావటం.. పోటీ నేపథ్యంలో తొందరపాటుతో వండేస్తున్న వార్తలతో సెలబ్రిటీల చావు వార్తలు ఈ మధ్యన తరచూ వస్తున్నాయి.

ఎవరైనా ప్రముఖుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స పొందుతుంటే చాలు.. అతడి పరిస్థితి విషమంగా ఉందన్న మాట సోర్సు ద్వారావిన్న వెంటనే.. విషమంగా అంటే.. బతికే ఛాన్స్ తక్కువ.. ఏం ఫర్లేదు చనిపోయినట్లు ప్రకటించేయండి.. వార్తల్ని ముందు ఇచ్చేవిషయంలో మనమే ముందుండాలన్న తీరును మీడియా హౌస్ లు కొన్ని ప్రదర్శిస్తున్నాయి.

మొన్నటికి మొన్న అమ్మ జయలలిత మరణం విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. అధికారిక సమాచారానికి కొన్ని గంటల ముందే అమ్మ చనిపోయినట్లుగా ప్రకటించిన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు.. కాసేపటికి నాలిక కర్చుకొని ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పేర్కొనటం గమనార్హం.  ఇదే రీతిలో హాంకాంగ్ మార్షల్ ఆర్ట్స్ నటుడు.. దర్శక నిర్మాత అయిన జాకీచాన్ చనిపోయినట్లుగా వచ్చిన వార్త కొద్దిపాటి గందరగోళానికి గురి చేసింది.

ఆస్ట్రేలియాలోని ఒక రోడ్డు యాక్సిడెంట్ లో జాకీచాన్ చనిపోయినట్లుగా చైనీస్ బులిటెన్ లో వార్త రావటంతో గందరగోళం తలెత్తింది. చివరకు.. ఈవార్త ఆయన దగ్గరకే వెళ్లింది. దీంతో.. ఆయన స్పందించి తాను మరణించలేదని.. బతికే ఉన్నానని ప్రకటించాల్సి వచ్చింది. తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న జాకీచాన్ మరణించినట్లు గతంలో చాలానే వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటిదే మరోసారి వార్త వచ్చింది. రానున్న రోజుల్లో మరెన్ని సార్లు జాకీచాన్ ను వార్తలతో చంపేస్తారో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు