చంద్రబాబు జబ్బేంటో చెప్పిన జగన్

చంద్రబాబు జబ్బేంటో చెప్పిన జగన్

చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతుడు కారా. ఆయనకు రోగాలున్నాయా. అవి జగన్ కు తెలుసా. తెలుసంటున్నారు జగన్. అయితే ఆయన చెప్పిన రోగం సాధారణ రోగం కాదు. బాబు డబ్బు జబ్బుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు జగన్. పులివెందులలో ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన జగన్.. షరా మామూలుగా బాబుపై విరుచుకుపడ్డారు.

 చంద్రబాబుకు ఈ భూమ్మీద అన్నింటికంటే డబ్బంటేనే ఇష్టమని, రైతులపై చూపించే ప్రేమంతా నటనేనని జగన్ తేల్చేశారు. తాగునీరు, సాగునీరు కోసం ధర్నాలు చేస్తున్నా.. పట్టించుకోకుండా ఫ్లైట్లో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. వైఎస్ 80 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టుల్ని కూడా కంప్లీట్ చేయలేదని ఎద్దేవా చేశారు.

 పట్టిసీమ పేరుతో రాయలసీమ జనం చెవిలో పూలు పెట్టారన్నారు జగన్. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణలోకి మళ్లించారని, మరి సీమకు ఇవ్వాల్సిన శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కొత్త ప్రాజెక్టులు కట్టకుండా. ఉన్న ప్రాజెక్టులకు నీళ్లివ్వకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు జగన్.

 గండికోట ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని, చిత్రావతికి నీళ్లు రావడం లేదని ఎత్తిచూపారు జగన్. సీమను సస్యశ్యామలం చేస్తామంటున్న చంద్రబాబు.. నీళ్లెక్కడిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ సీమకు ఇచ్చేలా జీవో తేవాలని డిమాండ్ చేశారు జగన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు