పుట్టినరోజే వర్థంతి మాటలు

పుట్టినరోజే  వర్థంతి మాటలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినం రోజు ఆయనకు సొంత పార్టీ నేతే షాకిచ్చారు. వాజ్ పేయి మన మధ్య లేరని, కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దాంతో నాలుక్కరుచుకున్న సదరు నేత.. తర్వాత పొరపాటు సరిదిద్దుకున్నారు.

వాజ్ పేయి పుట్టినరోజు సందర్భంగా.. ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన బీజేపీ నేత శకుంతలా భారతి.. పొరపాటున నోరు జారారు. తర్వాత తప్పు సరిదిద్దుకుని, ఆ మాటలు తన నోటి వెంట ఎలా వచ్చాయో కూడా తెలియదని బాథపడ్డారు.

ఓవైపు వాజ్ పేయి బయటకు కనిపించడం లేదు. సీనియర్ నేతలు వెళ్లి పలకరించి వస్తున్నారు కానీ.. క్యాడర్ కు ఆయన ఎలా ఉన్నారో. ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో శకుంతలా భారతి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. క్యాడర్ మొత్తం వాజ్ పేయి నివాసానికి క్యూ కట్టడంతో అదుపుచేయడానికి భద్రతా సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది.

శకుంతలా భారతికి వివాదాస్పద వ్యాఖ్యలు కొత్త కాదు. గతంలో కూడా అలీఘర్ ముస్లిం వర్సిటీలో బీఫ్ వడ్డిస్తున్నారని వివాదం రేపారు. అధికారులు ఓ ఆవుని చంపి, ఆలయాన్ని కూడా కూల్చారని తెలిసీ తెలియకుండా ఆరోపించారు. అప్పుడు కూడా పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు మళ్లీ మరోసారి నోరు జారారు శకుంతల.