నవ్వుతూ భయపెట్టాడన్న వర్మకు వణుకేనా?

నవ్వుతూ భయపెట్టాడన్న వర్మకు వణుకేనా?

మాఫియా డాన్లు.. ఫ్యాక్షనిస్టులు.. రౌడీల సినిమాలు తీయటంలో వర్మకు ఎంతటి నైపుణ్యం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మేధావిగా.. అంతకు మించి తలతిక్క మనిషిగా ఇమేజ్ ఉన్న వర్మ.. ఎవరికి భయపడడు. దేనికి బెదిరిపోడన్న పేరుంది. వివాదాలతో సహజీవనం చేసే వర్మ.. వివాదరహితంగా వ్యవహరిస్తే కొత్తగా ఉంటుంది.

ఎవరూ ఆలోచించటానికి కూడా ఇష్టపడని వంగవీటి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకోవటమే కాదు.. దాన్ని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాను తీసే క్రమంలో పలువురిని కలిసి.. సమాచారాన్ని సేకరించిన వర్మ.. వీలైనంతవరకూ వివాదరహితంగా సినిమాను తీశారన్న టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఈ సినిమాలో రంగాను నెగిటివ్ గా చూపించినట్లుగా ఆయన కుమారుడు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. తన తండ్రికి సంబంధించిన సీన్లు అభ్యంతరకరంగా ఉన్నయన్న రాధా.. వాటిని తొలగించాలంటూ ఇప్పటికే డిమాండ్ చేశారు.

రాధా ఫిర్యాదుతో ఒక్క డైలాగ్ తొలగించేందుకు ఒప్పుకున్న వర్మకు.. తాజాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించేలా సినిమా తీసిన రాంగోపాల్ వర్మ అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. డబ్బు కోసం సినిమా తీసే బదులు.. డబ్బులు అడిగితే రంగా అభిమానులే ఆయనకు చందాలు ఇచ్చేవారన్నారు.

రంగా హంతకులు నేటికీ బయట తిరుగుతూనే ఉన్నారని.. తనకు అన్నీతెలుసన్న వర్మకు ఆ విషయం తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. తానేం చేయాలో అదే చేసి చూపిస్తానని.. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. తాను కూడా ఏం చేయాలో చేస్తానన్నారు. రంగా పెళ్లిని చూపించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. వంగవీటి రాధాకృష్ణ విషయంలో వర్మ గతంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను అనేకమంది రౌడీలు.. గూండాల్ని.. మాఫియా డాన్లను కలిశానని.. కానీ.. వారందరికి భిన్నంగా మౌనంగా ఉంటూ.. నవ్వుతూ భయపెట్టాడని వ్యాఖ్యానించారు. నాడు నవ్వుతూ భయపెట్టిన రాధా.. నేడు ఆగ్రహంతో వార్నింగ్ ఇవ్వటమే కాదు.. "ఏం చేయాలో అది చేసి చూపిస్తా" అని అనటం వర్మకు వణుకు పుట్టేలా చేస్తుందా? లేదా? అన్నది వర్మ రియాక్షన్ చూశాక మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు