రూ.2వేల నోటు ప్రింటింగ్ ఖర్చు ఎంతంటే..

రూ.2వేల నోటు ప్రింటింగ్ ఖర్చు ఎంతంటే..

కలలో కూడా ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన రూ.2వేల నోటు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్న వెంటనే.. రూ.2వేల నోటు ముచ్చట అధికారికంగా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓపక్క పెద్దనోట్లను రద్దు చేస్తూ.. మరోవైపు రద్దు చేసిన నోట్ల విలువకు డబుల్ విలువ ఉన్న రూ.2వేల నోటును చెలామణిలోకి తీసుకురావటంపై ఆసక్తికర చర్చే నడుస్తోంది.

ఓవైపు పెద్దనోట్లు వద్దంటే వద్దని చెబుతూనే.. మరోవైపు మరింత పెద్దనోటును ఎందుకు తీసుకొచ్చారన్న సూటి ప్రశ్నకు.. మోడీ సర్కారు సంతృప్తికరమైన సమాధానం ఇప్పటివరకూ ఇచ్చింది లేదు. కాకుంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసిన నేపథ్యంలో.. రద్దు చేసిన పెద్దనోట్ల విలువలో ఎంతోకొంత భాగాన్ని త్వరగా భర్తీ చేయటానికి దగ్గర దారిగా రూ.2వేల నోటేనన్న భావనతోనే ఈ కొత్త నోటును తెర మీదకు తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొత్త రూ.2వేల నోటు ప్రింటింగ్ కు అవుతున్న ఖర్చు ఎంతన్న విషయంపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. అదే సమయంలో పాత రూ.500 నోటు స్థానే  కొత్తగా రూ.500 నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత రూ.500నోటుతో పోలిస్తే.. కొత్త రూ.500 నోటు సైజు పరంగా చాలా చిన్నదనే చెప్పాలి. అదేసమయంలో వెయ్యి రూపాయిల నోటుతో పోల్చినా.. దానికి డబుల్ విలువైన రూ.2వేల నోటు కూడా చిన్నది కావటం తెలిసిందే.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సైజు పరంగా రూ.500.. రూ.2వేల నోటు చిన్నదే అయినా..నోట్ల ముద్రణ ఖర్చు విషయంలో మాత్రం పాత.. కొత్త నోట్లకు ఏమాత్రం వ్యత్యాసం లేదన్న మాట అధికారికంగా బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసిన ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా కొత్త రూ.500.. రూ.2వేల నోటుకు అయ్యే ఖర్చు లెక్కను రిజర్వ్ బ్యాంకు అనుబంధ సంస్థ ఆర్ బీఐ నోటు ముద్రణ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బదులిస్తూ.. రూ.500 నోటుకు రూ.3.09.. రూ.2వేల నోటుకు రూ.3.54ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది.

పాత నోట్లతో పోలిస్తే.. కొత్త నోట్లు సైజు పరంగా చిన్నవే అయినా.. రెండింటి ముద్రణ ఖర్చు విషయంలో ఏ మాత్రం మార్పులేదని పేర్కొన్నారు. పాత రూ.500 ముద్రణకు అయ్యే ఖర్చే.. కొత్త రూ.500 నోటుకు ఖర్చు అవుతుందని.. అదే సమయంలో కొత్తగా ముద్రించిన రూ.2వేల నోటు ఖర్చు పాత రూ.వెయ్యి నోటుకు అయ్యే ఖర్చే అవుతుందని వెల్లడైంది. రూ.వెయ్యి నోటు ప్రింటింగ్ కి అయ్యే ఖర్చుతో రూ.2వేల నోటు రిలీజ్ చేయటం ఆసక్తికరంగా అనిపించట్లేదు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు