రోజుకో మాట.. బాబు నోట

రోజుకో మాట.. బాబు నోట

ఏపీ సీఎం చంద్రబాబు నోట్లరద్దు విషయంలో చాలా అయోమయానికి గురవుతున్నారు. మొదట నోట్లరద్దు నిర్ణయం సాహసోపేతమని స్వాగతించిన ఆయన.. ఇప్పుడు తల బద్దలవుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్యూల్లో వృద్ధులు చనిపోతున్నారని ఆవేదన చెందారు.
     
నవంబర్ 8న మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించగానే.. అర్థరాత్రే ప్రెస్ మీట్ పెట్టిన బాబు.. నోట్లరద్దు చేయాలని ఎప్పట్నుంచో కోరుతున్నానని చెప్పారు. మొదట్లో కొన్నాళ్లు ఇబ్బందులున్నా.. తర్వాత అంతా సర్దుకుంటుందని, దేశానికి మంచి జరుగతుందని చెప్పుకొచ్చారు.
      
నోట్లు రద్దై రెండువారాలైనా నగదు కష్టాలు తీరకపోవడంతో.. బ్యాంకర్లతో బాబు సమీక్ష నిర్వహించారు. రద్దు నిర్ణయం మంచిదైనా.. అమలు సరిగ్గా జరగడం లేదని బ్యాంకర్లే బాధ్యత వహించాలని మండిపడ్డారు. దీనికి బ్యాంకర్లు దీటుగానే సమాధానం చెప్పారు. ఆర్బీఐ నగదు పంపకుండా తామేం చేయలేమని కుండబద్దలు కొట్టారు.
       
ఇప్పుడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో మనసులో మాట చెప్పిన బాబు.. నోట్ల రద్దు తాము కోరుకున్నది కాదనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. హుద్ హుద్ తుపాను తర్వాత కూడా ఎనిమిది రోజుల్లో సాధారణ పరిస్థితి నెలకొందని, కానీ ఇప్పుడు మాత్రం ఎన్నిరోజులకు కష్టాలు తీరతాయో అర్థం కావడం లేదని చెప్పారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సీఎంల కమిటీకి కన్వీనర్ అయిన బాబు.. ఇలా మాట్లాడటం టీడీపీ నేతలకే విస్మయం కలిగించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు