జయలలిత గుండెపోటు.. అపోలో ప్రతాపరెడ్డికే షాకింగ్

జయలలిత గుండెపోటు.. అపోలో ప్రతాపరెడ్డికే షాకింగ్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై ఇప్పటికీ అనుమానాలు వీడడం లేదు. ఏదో జరిగింది.. అంతా రహస్యంగా ఉంచారు.. కుట్ర చేసిందెవరు.. వారికి సహకరించిందెదవరు.. వంటి విషయాల్లో ప్రజల్లో ఎన్నో అనుమానాలు. చివరకు ఆమెకు వైద్యం చేసిన అపోలో ఆసుపత్రి వర్గాలపైనా జనంలో ఆగ్రహం. వాస్తవాలు వెల్లడించకుండా ఈ కథంతా నడిపినవారికి సహకరించారని కోపం.. ఇలాంటి తరుణంలో అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ పెన్నా ప్రతాపరెడ్డి చెబుతున్న మాటలు ప్రజల్లో మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. జయకు గుండెపోటు వచ్చే సూచనలే ఎన్నడూ కనిపించలేదని.. ఆమెకు కార్డియాక్ అరెస్టని తెలియగానే తాను షాకయ్యానని ప్రతాపరెడ్డి చెబుతున్నారు.
   
ప్రతాప్‌ సి రెడ్డి ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పడేం జరిగిందో వివరించారు. ఒకటి రెండు రోజులు మినహా మిగిలిన రోజులన్నీ తానే దగ్గరుండి జయ చికిత్సను పర్యవేక్షించానని ప్రతాప్ రెడ్డి చెప్పారు. ప్రతి రోజూ ఆమె తనను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవారని చెప్పారు. జయలలిత ధైర్యాన్ని చూసి తానెంతో ఆశ్చర్యపోయానని చెప్పిన ఆయన..  సెప్టెంబర్‌ 22న అపోలో ఆస్పత్రిలో చేరినప్పటినుంచి జయలలితకు అందించిన చికిత్సలన్నింటిని తానే దగ్గరుండి పరిశీలించినట్లు చెప్పారు. 

రెండు మాసాలపాటు తాను చెన్నై నగరాన్ని విడిచిపెట్టలేదని, తమ శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటినీ జయలలితకు అందించినట్టు చెప్పారు. జయలలిత మృతి చెందటానికి కొద్ది రోజుల ముందు అత్యసవర పనుల మీద హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చిందని, బయలుదేరటానికి ముందు ఆమెను పలకరించానని, ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని ప్రతాప్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తానే దగ్గరగా వెళ్లి 'హైదరాబాద్‌ నుండి తిరిగొచ్చేలోపున మీరు లేచి నడుస్తారు' అంటూ చెప్పానని వివరించారు.
    
తాను హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చాక ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలియగానే షాక్‌ అయ్యానన్నారు. అప్పటిదాకా ఆమెకు గుండెపోటు వచ్చేందుకు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, అందుకే తాము షాక్‌ అయ్యామని ప్రతాప్‌రెడ్డి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు