ఏటీఎం క్యూలో మోడీపై చిరాకు పడితే

ఏటీఎం క్యూలో మోడీపై చిరాకు పడితే

మనకు భావస్వేచ్ఛ కాస్తంత ఎక్కువే. అయితే.. ఆ భావస్వేచ్ఛకు బయటకు కనిపించని పరిమితులు చాలానే ఉంటాయి. కొన్ని విషయాల మీద ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఏం జరుగుతుందో తెలిసిందే. అదే టైంలో మరికొందరు మాత్రం తమకు తోచింది ఎక్కడైనా మాట్లాడేస్తుంటారు. అలాంటి వారికి లేని అభ్యంతరాలు కొందరికి.. కొన్ని విషయాలకు మాత్రమే కనిపిస్తుంటాయి. ఇలా చెబుతుంటే.. ఏమీ అర్థం కావటం లేదా? ఓ చక్కటి ఉదాహరణ చెప్పొచ్చుగా అంటారా? అదే పని ఇప్పుడు చేయబోతున్నాం.

పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో చిల్లర నోట్లకు పడుతున్న కష్టాలెన్నో ప్రతి భారతీయుడికి తెలిసిందే. ఎంత క్యాష్ లెస్ చేద్దామని అనుకున్నా.. రోజువారీ అవసరాలకు కాసింత డబ్బులు కావాల్సిందే. బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నా.. చేతికి రాని పరిస్థితి. ఏటీఎంలు ఎప్పుడూ మూతబడి ఉండటం.. ఎప్పుడైనా ఓపెన్ చేసినా.. కాసేపటికే ఖాళీ అవుతున్న పరిస్థితి. దీంతో.. ఏటీఎంల దగ్గరా.. బ్యాంకుల దగ్గర భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి.

డబ్బుల కోసం ఈ క్యూలలో నిలుచునే చాలామంది విసుగు.. కోపాన్ని ప్రదర్శించటం.. అసహనంతో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేయటం లాంటివి తరచూ కనిపిస్తున్న పరిస్థితి. అయితే.. మనసులో కలిగే భావాల్ని అణుచుకోవటమే తప్పించి.. ఆగ్రహంతో మాట్లాడిన వారితో గొడవలు పెట్టుకోవటం.. అవి తగాదాలుగా కొన్ని మారుతుంటే.. మరికొన్ని కోట్లాటల వరకూ వెళుతున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు క్యూలైన్ల దగ్గరా.. బ్యాంకుల వద్దా మాటల్ని ఆచితూచి మాట్లాడాలే తప్పించి తొందరపడి మాట్లాడకూడదన్న భావన కలగటం ఖాయం.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని డబ్బుల కోసం క్యూ దగ్గర 45 ఏళ్ల లాలన్ సింగ్ కుష్ వాహ అనే వ్యక్తి నిలుచున్నాడు. గంటలు గడుస్తున్నా.. తనకు అవకాశం రాకపోవటంతో చిరాకు చెందిన అతగాడు.. మోడీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య జనమంతా ఇలా క్యూలో నిలుచొని నానా బాధలు పడాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కుష్ వాహ పక్కనే ఉన్న ఆషిక్ అనే యువకుడు.. మోడీపై చేసిన విమర్శలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్యా వాగ్వాదం చోటు చేసుకున్నాడు. అంతే.. ఆగ్రహం ఆపుకోని ఆషిక్ క్రికెట్ స్టంప్స్ తీసుకొని కుష్ వామ నెత్తి మీద బలంగా మోదాడు. దీంతో.. తీవ్ర రక్త స్రావానికి గురి కావటంతో పాటు స్పృహ తప్ప పడిపోయాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఈ ఉదంతాన్ని చూసినప్పుడు.. ఇదే తరహాలో కొన్ని గొడవలకు సంబంధించిన వార్తల్ని చదివినప్పుడు అనిపించేది ఒక్కటే.. మనసులో ఆగ్రహం ఉన్నప్పటికీ.. నోరు మూసుకొని ఉండాలే కానీ.. భావస్వేచ్ఛ ఉంది కదా అని నోరు విప్పితే.. లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని మర్చిపోవద్దు సుమా.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు