వర్మ సృష్టించిన దేవినేని నెహ్రూ ఇదిగో..

వర్మ సృష్టించిన దేవినేని నెహ్రూ ఇదిగో..

నిజ జీవిత కథలతో సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ స్టయిలే వేరు. వాస్తవంగా జరిగిందాన్ని మంచి ఇంటెన్సిటీతో.. డ్రామతో చెప్పడంలో ఆయన ప్రత్యేకత ఏంటో ఇప్పటికే 'రక్తచరిత్ర'.. 'ముంబయి అటాక్స్'.. 'కిల్లింగ్ వీరప్పన్' లాంటి సినిమాల్లో చూశాం. ఈ సినిమాలన్నింట్లో కనిపించే ప్రత్యేకత ప్రధాన పాత్రధారుల్ని ఆ పాత్రల కోసం మలిచిన తీరు. 'ముంబయి అటాక్స్' సినిమాల్లో కసబ్ పాత్రధారిని చూస్తే అతను నిజం కసబేనా అనిపిస్తుంది. 'కిల్లింగ్ వీరప్పన్లో వీరప్పన్ను చూస్తే.. వీరప్పన్ బతికి వచ్చేశాడా అనిపిస్తుంది. తాజాగా 'వంగవీటి' సినిమా కోసం వర్మ ఎంచుకున్న పాత్రధారుల్ని చూసినా ఆశ్చర్యం కలగకమానదు.

ఇప్పటికే వంగవీటి పాత్రధారిని చూశాం. అతను ఆ పాత్రకు భలేగా సూటయ్యాడు. ఇప్పుడు దేవినేని నెహ్రూ పాత్రధారిని పరిచయం చేశాడు వర్మ. శ్రీతేజ్ అనే నటుడిని ఈ పాత్ర కోసం పట్టుకొచ్చాడు వర్మ. శ్రీతేజ్ ను మామూలుగా చూస్తే ఏమీ అనిపించడు కానీ.. వర్మ మేకోవర్ తర్వాత మాత్రం అచ్చం దేవినేని లాగే తయారయ్యాడు. ఈ పాత్ర చేయడానికి ముందు దేవినేని మేనరిజమ్స్.. బాడీ లాంగ్వేజ్ గురించి శ్రీతేజ్ చాలా స్టడీ చేశాడని.. తర్వాత ఆ పాత్రను అద్భుతంగా పండించాడని వర్మ తెలిపాడు. దేవినేని.. శ్రీతేజ్ ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే వర్మ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఏ పాత్రలో ఎవరు ఎలా ఒదిగిపోయారు అన్నది ఈ నెల 23న తేలిపోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు