కేసీఆర్ ఇంట్లో ఎంత బంగారం ఉందో తెలుసా?

కేసీఆర్ ఇంట్లో ఎంత బంగారం ఉందో తెలుసా?

మాట్లాడితే బోళాగా అన్నీ చెప్పేయ‌డం లేదంటే అస‌లు మీడియాకే దూరంగా ఉండ‌టం అనే తీరును స్ట్రిక్ట్ గా పాటించే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు గురించి చెప్పారు.

పెద్ద నోట్ల ర‌ద్దు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల గురించి అసెంబ్లీలో మాట్లాడిన‌ కేసీఆర్ తాజాగా శాస‌న‌మండ‌లిలో ప్ర‌సంగించారు. నోట్ల ర‌ద్దుతోనే దేశంలో అవినీతి ప్రక్షాళ‌న ఆగిపోద‌ని పేర్కొంటూ బంగారంపై సైతం మోడీ న‌జ‌ర్ ఉంద‌న్నారు. సాక్షాత్తు త‌న బంగారం గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌శ్నించార‌ని కేసీఆర్ తెలిపారు.

ఢిల్లీలో తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని క‌లిసిన‌పుడు నోట్ల ర‌ద్దు-ప‌రిణామాల గురించి ప్ర‌స్తావిస్తూ బంగారం విష‌యాన్ని చెప్పగా...మీ వ‌ద్ద ఎంత బంగారం ఉంద‌ని ప్ర‌ధాని త‌న‌ను ప్ర‌శ్నించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు.

త‌న వ‌ద్ద మూడు ఉంగ‌రాలు, మెడ‌లో ఒక చైన్ ఉంద‌ని చెప్పి, ఇంటి ద‌గ్గ‌ర త‌న భార్య వద్ద సుమారు 50-60 తులాల స్వ‌ర్ణం ఉంద‌ని వివ‌రించిన‌ట్లు కేసీఆర్ వివ‌రించారు. అయితే అదే స‌మ‌యంలో బంగారం గురించి అంచనాలు లేకుండా పోవ‌ద్ద‌ని, వార‌సత్వంగా వ‌చ్చిన బంగారం వంటివి దృష్టిలో ఉంచుకోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి తాను స్వ‌యంగా సూచించాన‌ని కేసీఆర్ చెప్పారు.

కొంద‌రు భ్ర‌మ‌ప‌డుతున్న‌ట్లు ఇంట్లో ఉన్న బంగారం వంటివి లెక్క‌లు అడ‌గ‌ర‌ని, అక్ర‌మంగా క‌డ్డీల రూపంలో దాచుకున్న‌దాని గురించి మాత్ర‌మే ప్ర‌శ్నిస్తార‌ని వెల్ల‌డించారు. ఇలా అక్ర‌మంగా దాచుకున్న దాని గురించి వెలికి తీయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, మ‌నమంతా దేశం కోసం ఇలాంటి నిర్ణ‌యాల‌ను స్వాగ‌తించాల‌ని కేసీఆర్ కోరారు.  

కాగా నోట్ల రద్దు వల్ల దేశానికి మంచి జరుగుతదని ఆశిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. తనకున్న అవగాహన మేరకు భవిష్యత్‌లో రెండే ట్యాక్సులు ఉండొచ్చని చెప్పారు. ఒకటి జీఎస్‌టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్).. రెండోది బీటీటీ(బ్యాంకు ట్రాన్సాక్షన్ ట్యాక్స్) అని తెలిపారు. చివరికి పన్నుల విధానం కూడా మారుతుందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

నగదు రహిత సమాజం అనేది అలుపెరగని ప్రక్రియ అని చెప్పిన కేసీఆర్ ఏది రాత్రికి రాత్రే సాధ్యం కాదని విశ్లేషించారు. భవిష్యత్ అవినీతి రహితం కానుందని  గొప్ప సంస్కరణలు చేపట్టినప్పుడు తుది ఫలితం కోసం వేచి చూడాలని సూచించారు. క్యాష్‌లెస్ లావాదేవీలు అంటే ఒక్క స్వైపింగ్ మాత్రమే కాదు.. 51 రకాల మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు.

రాబోయే 15 రోజుల్లో 70-80 గ్రామాలో నగదు రహిత గ్రామాలుగా మారనున్నాయని తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గాన్ని రెండు వారాల్లో నగదు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు