జయలలిత చీరలపై తెలంగాణ మంత్రి ఫోకస్

జయలలిత చీరలపై తెలంగాణ మంత్రి ఫోకస్

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అనూహ్యంగా వేదాంతంలోకి దిగారు. ఎవరు ఎంత సంపాదించుకున్నా ఏమీ వెంట తీసుకెళ్లలేరంటూ జయలలిత ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల అనంతరం అసెంబ్లీ లాబీలో  విలేకరులతో మాట్లాడిన ఆయన... మానవ జీవితంలో విలువల అవసరం, బ్లాక్ మనీ తదితర అంశాలపై ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రస్తావన తెచ్చారు.  పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకువెళ్లలేమని...  జయలలిత మాత్రం తన వెంట ఏం తీసుకెళ్లారని, ఆమె పది వేల చీరలు ఏమై పోయాయని ప్రశ్నించారు.
   
అంతేకాదు.. పెద్ద నోట్ల విషయంలోనూ ఆసక్తికర కామెంట్లు చేశారు. కొందరు తమ పార్టీకే చెందిన నేతలు తనకు ఫోన్ చేసి తన వద్ద పాత పెద్ద నోట్లు ఉంటే మార్చిపెడతామని ఆఫర్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.  అయితే 'మీ దగ్గరే ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి.. అప్పులు తీర్చుకుంటా'నని వారితో అన్నానని నవ్వుతూ చెప్పారు.    తాను దేవుడిని నమ్మనని పేర్కొన్న మంత్రి తనకు దేవుడిపై విశ్వాసం లేకున్నా రూ.5 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.  ఇదంతా ఎలా ఉన్నా ఈటెల వ్యాఖ్యలతో జయలలిత గురించి పొలిటికల్ సర్కిళ్లలో ఎలాంటి అభిప్రాయం ఉందనేది అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు