రాహుల్ పై విపక్షాల ఫైర్

రాహుల్ పై విపక్షాల ఫైర్

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వేసిన ఎత్తుగడపై నిన్నటి వరకు ఆయనతో కలిసి మెలిసి ప్రధాని నరేంద్ర మోదీని ఇరకాటంలో పడేసిన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఉమ్మడిగా కార్యాచరణ నిర్ణయించి సొంతంగా ఎజెండాను ఫిక్స్ చేసుకున్న రాహుల్ గాంధీపై విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్‌కు మార్చ్ నిర్వహించి, రాష్ట్రపతిని కలవాలని ప్రతిపక్షాలు భావించాయి. అయితే ఈలోపు ప్రధానిని రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కలవడంతో ఈ మార్చ్‌ను రద్దు చేసుకున్నాయి. లెఫ్ట్ పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ, డీఎంకే సభ్యులు ఈ మార్చ్‌కు దూరంగా ఉన్నారు. అయితే మిగతా ప్రతిపక్షాలను సంప్రదించకుండానే రాహుల్.. మోదీని కలవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రైతుల రుణాలు మాఫీ చేయాలంటూ రాహుల్ బృందం.. ఈ సమావేశంలో ప్రధానమంత్రిమోదీని కోరింది. ఈ విషయమై విపక్షాలు మండిపడ్డాయి. మాకు మాత్రం రైతుల ఇబ్బందులపై ఆందోళన లేదా అంటూ ఓ బీఎస్పీ నేత ప్రశ్నించారు. దీంతో కలసివచ్చిన కొన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. రాష్ట్రపతిని కలిశారు. సోనియాతో వెళ్లినవారిలో తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ ఉన్నాయి. ప్రధాని వ్యక్తిగత అవినీతిపై తన దగ్గర సమాచారం ఉందని రెండు రోజుల కిందట రాహుల్ ప్రకటించిన సమయంలో లెఫ్ట్ పార్టీలు సహా అన్ని ప్రతిపక్షాలు రాహుల్ వెనకే ఉండటం గమనార్హం. నోట్ల రద్దుపై పార్లమెంట్లో కలిసి పోరాడిన ప్రతిపక్ష సభ్యులు.. రాహుల్-మోదీ భేటీ తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు