సీన్ రివర్స్ః పాత నోట్లకు డిమాండ్

సీన్ రివర్స్ః పాత నోట్లకు డిమాండ్

రూ.500, రూ.1000 విలువ గల పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దును చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన తర్వాత పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.500, రూ.1000 నోట్లను బ్లాక్ మనీ రూపంలో కలిగి ఉన్నవారు వాటిని మార్చుకునేందుకు 20-30 శాతం కమిషన్లు ముట్టచెప్పి మరీ కొత్త నోట్లు పొందారు. అయితే ఇపుడు సీన్ రివర్స్ అయింది. పాత నోట్లను పొందేందుకు సుమారు 5-10% కమీషన్ ముట్టచెప్తున్నారట! ఎందుకంటే మళ్లీ బ్లాక్ మనీ ప్రాబ్లం!!

అనేక కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు తమ ఖాతా పుస్తకాల్లో వివిధ రకాలకు మొత్తం ఖర్చు అయినట్లు చూపిస్తుంటారు. అయితే వీటిని సదరు అవసరానికంటే... లంచాలు ఇచ్చేందుకు, ఇతరత్రా ఖర్చులు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇపుడు అలా చూపించిన మొత్తాలను బ్యాంక్ ఖాతాల్లో చూపించుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు పాత నోట్లే ఉపయోగించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం-ఆర్బీఐ ఇటీవల కొత్త నోట్లు, పాత నోట్ల డిపాజిట్ల వివరాలను ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రద్దైన రూ.500, రూ.1000 నోట్లలోనే సదరు ఖాతాల నిధులను చూపించాలి. అంటే పాత నోట్ల ద్వారానే డిపాజిట్లు చేయాలి. దీంతో పాత నోట్లను పొందేందుకు సదరు వ్యాపారవేత్తలు సెర్చింగ్ మొదలుపెట్టారట.

ఈ క్రమంలోనే పాత నోట్లను ఇచ్చే వారి కోసం వెతుకులాట మొదలైంది. అయితే తమవద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను దాదాపు అందరూ మార్చేసుకోవడంతో ఇపుడు ఆ నోట్లు దొరకడం లేదు. దీంతో సదరు నోట్లను అందించిన వారికి 5-10 కమిషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు పలువురు ఆఫర్లు పెడుతున్నారు. మొత్తంగా సీన్ రివర్స్ అయి పాత నోట్లకు డిమాండ్ చేయడం ఆసక్తికరం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు