పాపం…ఫిరాయింపుల గతేమవుతుందో ?

పశ్చిమబెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓ ఇంట్రస్టింగ్ పాయింట్ పై చర్చ పెరిగిపోతోంది. అదేమిటంటే ఫిరాయింపుల భవిష్యత్తుపై. నిజానికి ఉన్నదన్నుట్లుగా మమతాబెనర్జీనీ ఎదుర్కొనే సత్తా బీజేపీ అగ్రనేతలకు లేదనే చెప్పాలి. మమతను ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులను బీజేపీ అగ్రనేతలు ప్రోత్సహించారు.

24 గంటలూ రాజకీయాల్లో విలువలు, నిజాయితి గురించి గొంతెత్తి మాట్లాడే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆమోదంతోనే ఫిరాయింపులు జరిగిన విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోల్ కత్తాలో జరిగిన ఓ బహిరంగ సభలో తృణమూల్ పార్టీలో నుండి చాలామంది ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు బీజేపీలోకి వచ్చేయబోతున్నట్లు స్వయంగా మోడినే ప్రకటించారు. అప్పట్లో మోడి ప్రకటన దేశరాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి.

ఆ తర్వాత నుండి ఓ పద్దతి ప్రకారం అమిత్ షా ప్రలోభాల పర్వాన్ని దగ్గరుండి రక్తి కట్టించారు. మొత్తం మీద మమతను దెబ్బ కొట్టే టార్గెట్ తోనే 29 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంపిలతో పాటు అనేక మంది నేతలను బీజేపీలోకి లాగేసుకున్నారు. తృణమూల్ నుండి బీజేపీలోకి ఫిరాయించిన వారిలో అత్యధికుల మీద భారీ ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. అయినా వాళ్ళని బీజేపీ చేర్చేసుకున్నది.

మరిపుడు వాళ్ళల్లో ఎంతమందికి బీజేపీ టికెట్లిస్తుందో చూడాలి. అలాగే టికెట్లు తీసుకున్న వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారన్న పాయింట్ మీదే చర్చ పెరిగిపోతోంది. టికెట్లు ఏపిలో కూడా చంద్రబాబునాయుడు ఇలాగే ప్రలోభాలకు గురిచేసి 2014లో గెలిచిన 23 మంది వైసీపీ ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను టీడీపీలోకి లాక్కున్నారు. అయితే వాళ్ళల్లో 17 మంది ఎంఎల్ఏలకు మాత్రమే టికెట్లిచ్చారు. వాళ్ళలో కూడా గెలిచింది కేవలం ఒక్కళ్ళే. మరి ఇదే పద్దతిలో బెంగాల్లో కూడా జరగటంతో ఇదే పాయింట్ మీద చర్చలు జోరందుకున్నాయి. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.