అసెంబ్లీ వేదిక‌గా న‌యీం క‌థ‌లు

అసెంబ్లీ వేదిక‌గా న‌యీం క‌థ‌లు

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల నేప‌థ్యంలో రాష్ట్ర శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి, సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు  హరీశ్‌ రావు ఓ మీడియా చాన‌ల్ తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ప్రజా సమస్యలపై ఎంత సమయమైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,ప్రతి అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలని అన్నారు.

అయితే ప్రతిపక్షాలు సభలో రచ్చ చేయాలనుకుంటే ఉపేక్షించేది లేదని హ‌రీశ్ రావు తేల్చిచెప్పారు. ప్రభుత్వం తరపున ఏవైనా తప్పులు జరిగితే వాటిని చెప్తే స‌ర్దుకుంటామ‌ని అయితే అసెంబ్లీ అంటే ప్రతిపక్షాలదే అనుకోవటం సరికాదని హ‌రీశ్ స్ప‌ష్టం చేశారు.

శాసనసభ సమావేశాల సందర్భంగా గ్యాంగ్ స్ట‌ర్ నయీం కేసును ప్రతిపక్షాలు లేవనెత్తటం కాదు..ప్రభుత్వమే చర్చకు పెడుతుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. నయీంతో కలిసి అక్రమాలకు పాల్పడిన వారి బాగోతాలను తాము బట్టబయలు చేస్తామని ప్రకటించారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, జిల్లాల విభజన, కరెన్సీ కష్టాలపై కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, టీడీపీలు ప్రధానంగా చర్చ కు పట్టుబట్టే అవకాశముందని తమకు తెలుసని హరీశ్ అన్నారు.

విపక్షాలు సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నాం కాబట్టే రెండువారాలపాటు ఉభయ సభల నిర్వహణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ ధైర్యంగా ఉన్నారని హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. సభలో అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్ష నేతలు సహకరించాలని కోరుతూ ప్రజాసమస్యలపై తాము చర్చకు సిద్ధమేనని హరీశ్ స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు