రూ.2200 కోట్ల రూపాయలతో బాబు రెడీ

రూ.2200 కోట్ల రూపాయలతో బాబు రెడీ

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రుల సంఘానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఎలాంటి చిక్కులు ఎదురుకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా సెలవులు రావడం, మరోవైపు నగదు అందుబాటులో ఉన్న నేపథ్యంలో తాజాగా తన నివాసం నుంచి విపత్తు నిర్వహణ శాఖ, ఆర్ధిక శాఖ అధికారులతో, జిల్లాల కలెక్టర్లతో, బ్యాంకర్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఒకవైపు వార్ధా తుపాన్, మరోవైపు డిమానిటైజేషన్...రెండింటినీ సమర్ధంగా ఎదుర్కోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తుపాను బాధితులకు సహాయ, పునరావాస చర్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు స్థంభాలు, సిమెంటు, నగదు, రేషన్ సరుకులు, కావాల్సినవాటిని అన్నింటినీ ముందే సిద్దం చేసుకోవాలన్నారు. విపత్తులలో ప్రజలకు అండదండలు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే నన్నారు.

మరోవైపు నోట్ల రద్దు సమస్యలను జాగ్రత్తగా ఎదురుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వివిధ బ్యాంకులలో చెస్ట్ లలో రూ.750కోట్లు నగదు ఉందని, దీనికి అదనంగా నిన్న మరో రూ.1450 కోట్లు నగదును బ్యాంకులకు పంపడం జరిగిందని ఆర్ధిక శాఖ అధికారులు వివరించారు. ఇందులో రూ.2వేల నోట్లతో పాటు రూ.500, రూ.100, రూ.50 నోట్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం రూ.2,200 కోట్ల నగదును సక్రమంగా పంపిణీ చేయాలని, ప్రజలకు నగదు కొరత లేకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రెండురోజులకు అదనపు నగదు వస్తోంది, కాబట్టి చాలావరకు ఒత్తిడిని అధిగమిస్తున్నట్లుగా చెప్పారు.

ప్రతిరోజూ రూ.20వేల కోట్లు నగదు ప్రింటింగ్ జరుగుతోందని, రూ.500నోట్లు రూ.4వేల కోట్లు రానున్నాయని తెలిపారు. గతంలో ఉన్నంత నగదు చలామణిలో ఉండదంటూ, దాదాపు రూ.5లక్షల కోట్లు తగ్గుతుందన్నారు. కాబట్టి అన్నివర్గాల ప్రజలు డిజిటల్ నగదు వినియోగంపై దృష్టిపెట్టాలన్నారు. రాబోయే మూడురోజులు సెలవులు కాబట్టి ఏటిఎంలలో నగదు నింపాలని, ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.

వృద్దులు, పింఛన్ దారులు, మహిళలకు చెల్లింపులలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నాబార్డుతో మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంకుతో అనుసంధానం చేసుకోవాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు వేతనాల చెల్లింపులలో పోస్టల్ సిబ్బందికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. దాదాపు రూ.114 కోట్లు పోస్టాఫీసుల ద్వారా చెల్లించాల్సివుందంటూ, దీనికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ఖర్చులు వాయిదా వేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, డిజిటల్ లావాదేవీలను పెంచడమే సమస్యకు పరిష్కారమని చంద్రబాబు పేర్కొన్నారు. ఖర్చులు వాయిదా వేసుకుంటే ఆర్ధిక కార్యకలాపాలు దెబ్బతింటాయని చెప్పారు. గతంకన్నా ఆన్ లైన్, మొబైల్ లావాదేవీలు 10.5% పెరిగాయని బ్యాంకర్లు తెలుపగా, వీటిని 20%కు పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు.

మన ఆర్ధిక వ్యవస్థకు గ్రామాలే మూలాలంటూ, గ్రామీణ బ్యాంకులకు నగదు రవాణా పెంచాలన్నారు. ఈ పాస్ మిషన్లు భరించలేని వ్యాపారులు క్యు ఆర్ కోడ్ కు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. క్యూఆర్ కోడ్ కు డివైస్ అవసరం లేదని, సెల్ ఫోన్ ను డివైస్ గా పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఆర్టీసిలో కూడా క్యుఆర్ కోడ్ వినియోగం పెంచాలని సూచించారు.

సిండికేట్ బ్యాంకు సహకారంతో కర్నూలు, అనంతపురం జిల్లాలలో 2గ్రామాలను నగదురహితంగా ప్రకటించడాన్ని అభినందించారు. బ్రాంచికి ఒకగ్రామాన్ని దత్తత చేసుకుని రాష్ట్రంలో 400గ్రామాలను నగదురహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిండికేట్ బ్యాంకు ప్రతినిధి తెలిపారు. డిజిటల్ నగదు మాసోత్సవంగా డిసెంబర్ నెలను ప్రకటించి ప్రజలను ఆన్ లైన్ లావాదేవీలలో చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు.

కృష్ణా జిల్లాలో చోడవరంతో సహా 4 గ్రామాలను నగదురహితం చేసేందుకు 500మంది విద్యార్ధులను ఎంపికచేసి శిక్షణ ఇచ్చినట్లుగా ఆంధ్రాబ్యాంకు డీజిఎం చెప్పారు. నూజివీడు, అవనిగడ్డ, మచిలీపట్టణం, స్వరాజ్ మైదాన్ రైతు బజార్లలో కూడా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఉద్యోగులకు 5బ్యాచ్ లుగా శిక్షణ ఇచ్చినట్లుగా తెలిపారు. 27వేల రూపె కార్డులను పంపిణీ చేశామని, 23వేల జన్ ధన్ ఖాతాలను కొత్తగా తెరిచినట్లుగా చెప్పారు. మొబైల్ లావాదేవీలు లక్షా18వేలనుంచి లక్షా36వేలకు పెరిగాయని వివరించారు.

అదే స్ఫూర్తితో మిగిలిన బ్యాంకులు కూడా గ్రామాలను నగదురహితం చేసేందుకు ముందుకు రావాలని, ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆర్ధిక కార్యకలాపాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, అయితే దానిని సక్రమంగా అమలుచేయడంవల్లే పరిష్కారానికి నోచుకుంటాయని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English