'అమ్మ' ఆత్మహత్య చేసుకుందామనుకున్న వేళ..

'అమ్మ' ఆత్మహత్య చేసుకుందామనుకున్న వేళ..

జయలలితకు విప్లవ నాయకి అని.. పోరాట యోధురాలు అని ఊరికే బిరుదులు రాలేదు. ఆమె జీవితం ఆద్యంతం పోరాటమే. పదహారేళ్లకే కథానాయికగా మారి.. కుటుంబాన్ని పోషించే బాధ్యతను నెత్తికెత్తుకున్న జయలలిత.. వ్యక్తిగత జీవితంలో.. ఆపై రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నిరంతర పోరాటంతో మహా నేతగా ఎదిగారు. ఐతే ఈ పోరాటానికి ముందు ఆమె కూడా సామాన్యుల్లాగే కష్టాలకు జడిసిందట. ఓ దశలో ఆత్మహత్య చేసుకుందామని కూడా ప్రయత్నించిందట.

70ల్లో దక్షిణాదిన అత్యధిక పారితోషకం అందుకున్న కథానాయికగా రికార్డు సృష్టించిన జయలలిత.. ఆ తర్వాత అదే స్థాయిలో హవా సాగించలేకపోయింది. 80ల్లోకి వచ్చేసరికి ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు ఆమె తల్లి చనిపోయింది. మరోవైపు ఆమెకు అత్యంత చేరువైన శోభన్ బాబుతో విభేదాలు వచ్చాయి. ఆ సమయంలోనే లంకంత కొంపలో ఒంటరిగా జీవనం సాగించిన జయలలిత.. జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట.

ఐతే ఆ సమయంలోనే ఎంజీఆర్‌ ఆమెను ఊరడించి.. రాజకీయాల్లోకి ఆహ్వానించారట. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో కూడా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా.. ఎంజీఆర్ చనిపోయాక కూడా సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చినా.. మొండి ధైర్యంతో నిలబడింది జయ. ఆ పోరాట తత్వమే ఆమెను తిరుగులేని నాయకురాలిగా తీర్చిదిద్దింది. తమిళ జనాల గుండెల్లో చెదిరిపోని స్థానాన్ని తెచ్చిపెట్టింది

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English