నోట్ల రద్దుతో నష్టపోయామంటున్న బాబు

నోట్ల రద్దుతో నష్టపోయామంటున్న బాబు

పెద్ద నోట్ల ర‌ద్దు వల్ల ఆంధ్ర‌ప్రదేశ్‌కు క‌లుగుతున్న న‌ష్టంపై ఎట్ట‌కేల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పెద‌వి విప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దుతో ఇప్పటివరకూ రూ.800 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని చంద్రబాబు తెలిపారు.

నగదు రహిత లావాదేవీలు పెంచుకోవడం ద్వారా నోట్ల కొరత ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని తెలిపారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్ర‌బాబు హంద్రీనీవా రెండో దశ కింద పెనుకొండ మండలంలో నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయరును ప్రారంభించారు. గంగపూజ చేసి రిజర్వాయరులోకి నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణవేణి విగ్రహంతో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ 86 శాతమున్న రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడం వల్ల నోట్ల సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఇది రాష్ట్ర ఆదాయాన్ని కూడా తగ్గించిందన్నారు. ఇప్పటివరకూ రూ.800 కోట్ల ఆదాయానికి నష్టం జరిగిందని తెలిపారు. సమస్యలున్నాయని కూర్చోకుండా దానిని అధిగమించడం ఎలాగన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరముందని బాబు విశ్లేషించారు. అందులో భాగంగానే నగదు రహిత లావాదేవీల పెంపు కోసం చర్యలు చేపట్టామన్నారు.

ప్రతి గ్రామంలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారి ద్వారా నగదు రహిత లావాదేవీలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ విధంగా శిక్షణ ఇచ్చే వారికి కనీసం రూ.5 వేల పారితోషికం లభించేలా చూస్తామని చంద్ర‌బాబు ప్రకటించారు. కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి తాను కన్వీనరుగా ఉన్నందున.. ప్రపంచంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కడ బాగా అమలులో ఉన్నాయో చూసి ఇక్కడ అమలు చేయిస్తామని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకే వారితో సానుకూలంగా ఉంటున్నట్లు పేర్కొంటూ...అన్నీ ఆలోచించే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని వివరించారు.

తానెవరికీ భయపడబోనని తన హైకమాండ్‌ ప్రజలేనని చంద్ర‌బాబు స్పష్టం చేశారు. రూ.27 వేల కోట్లతో అనంతపురం నుంచి అమరావతికి ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణం చేపట్టనున్నామని చంద్ర‌బాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయిన వారికి హెక్టారుకు రూ.15 వేలు చెల్లిస్తామని ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు