కోదండరాంకు సిగ్గుండాలంటున్న కేటీఆర్

కోదండరాంకు సిగ్గుండాలంటున్న కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంల మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందనేది మరోమారు రుజువైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సీఎం కేసీఆర్ తనయుడు-రాష్ట్ర మంత్రి కేటీఆర్ జేఏసీ చైర్మన్‌పై తనకున్న అసహనాన్ని వెళ్లగక్కారు. ములుగును కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి కోదండరాం వేదిక పంచుకోవడంపై రుసరుసలాడారు.

''కోదండరాంగారు కూడా స్థాయిని తగ్గించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆక్రోశించింది నీళ్లకోసమే కదా. సీఎం నీళ్ళు ఇస్తా అంటుంటే సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? ములుగు జిల్లా కేంద్రం కావాలని ఇపుడు డిమాండ్ చేస్తున్నారు. రెండో దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో జిల్లా పెట్టినా ఆయనకు అభ్యంతరమేనా ? జయశంకర్‌సార్ మరణించినప్పుడే జిల్లాకు పేరు పెడ్తామని ప్రకటించాం. ఇప్పుడు అదే చేశాం. దీనికి శభాష్ అనాలి. అది మరిచి రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకుంటారా.. ? జయశంకర్‌తో వేదిక పంచుకున్నరు.. కేసీఆర్‌తో వేదిక పంచుకున్నరు.. ఇప్పుడు చిప్పకూడుతిన్న రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకుంటున్నరు.. ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చారు? సిగ్గుండాలి'' అంటూ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.


ఇక తమ రెండున్నరేళ్ల పాలనకు తామే మార్కులు వేసుకోవడం సరైంది కాదని కేటీఆర్ అన్నారు. అలాంటి మార్కులు ప్రజలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామన్నప్పటికీ లక్ష మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్‌ను నమ్మి అధికారం అప్పగించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు తాము స్కోర్లు వేసుకుని.. 30 ఏళ్లు, 300 ఏళ్లు తామే ఉంటామని చెప్తే అతి అవుతుందని అన్నారు. తాము 5 ఏళ్ల కోసం ఎన్నికయ్యామని పేర్కొంటూ.... ఈ ఐదేళ్లు సిన్సియర్‌గా శాయశక్తులా శ్రమిస్తామని తెలిపారు. ప్రజలు తాము బాగా పని చేశామని భావిస్తే.. మరోసారి అవకాశం ఇస్తారని లేదంటే ఇంట్లో కూర్చునేందుకు అయినా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు