లోప‌ల సీఎం..బ‌య‌ట పోలీసుల రౌండ‌ప్‌

లోప‌ల సీఎం..బ‌య‌ట పోలీసుల రౌండ‌ప్‌

కేంద్రం తీసుకువచ్చిన పెద్ద పాత నోట్ల రద్దును పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్య‌తిరేకిస్తుండ‌టం కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడేక్కుతుంది. నోట్ల ర‌ద్దును తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు విపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీలో నిరసనలు చేపట్టి రాష్ట్రపతికి విజ్ఞాపనలు సమర్పించారు. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణించిన ఇండిగో విమానం ఇంధన కొరత కారణంగా అత్యవసర ల్యాండింగ్‌కు సైతం అనుమతి ఆలస్యంగా దొరికింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో దీదీ హత్యకు కుట్రజరుగుతుందని పార్లమెంట్‌లో టీఎంసీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళనలు లేవనెత్తారు. కాగా కేంద్రం తాజాగా తీసుకున్న మరో చర్య సైతం ఈ ఘర్షణ వాతావరణాన్ని మరింతగా ఎగదోసింది.

పశ్చిమ బెంగాల్‌లోని 18 జిల్లాల్లో గల టోల్‌ప్లాజాల వద్ద ఆర్మీ భద్రతా సిబ్బందిని మోహరించింది. సెక్రటేరియట్‌కు 500 మీటర్ల దూరంలోనే టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి ఆర్మీ జవాన్లు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, టోల్‌ప్లాజాల వద్ద భద్రతను పర్యవేక్షించడానికి సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బందిని మోహరించినట్లుగా ఆర్మీ పేర్కొంటుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈశాన్య రాష్ర్టాల్లోని అసోంలో 18 ప్రాంతాలు, అరుణాచల్‌లో 13, నాగాలాండ్‌లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజోరాంలలో ఒక ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్ ద్వారా పేర్కొంది. కాగారాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఆర్మీని మోహరించడం ఏంటనీ మమతా అడుగుతున్నారు. ఇది సైనిక కుట్రనా అని ఆమె ఆరోపించారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ మమతా గడిచిన రాత్రి నుంచి ఇప్పటి వరకు సచివాలయంలోని ఆమె కార్యాలయంలోనే ఉన్నారు. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఆర్మీ ఖాళీ చేసి వెళ్లిపోయేంత వరకు కార్యాలయాన్ని విడిచి వెళ్లేది లేదని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను టీఎంసీ నేడు పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తింది. నోట్ల రద్దుపై టీఎంసీ తలపడుతున్నందునే రాజకీయ ప్రతికారంలో భాగంగానే కేంద్రం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని టీఎంసీ పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English