షర్మిల ఖాతాలో రోజుకొకరు బలి

షర్మిల ఖాతాలో రోజుకొకరు బలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెల్లెమ్మ, జగనన్న వింటినుంచి వెలువడిన బాణం షర్మిల సీమాంధ్రలో ప్రస్తుతం చేస్తున్న బస్సు యాత్రను గ్రహాలు కాస్త వక్ర, శని దృష్టితో చూస్తున్నట్లుంది. ఆమె యాత్ర రోజుకొకరు వంతున బలి కోరుతోంది.
రెండు రోజుల కిందట షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు.. ఆ జిల్లాలోని పార్టీ కీలక నాయకుల్లో ఒకరైనా కోడూరు సుధాకరరెడ్డి ప్రమాదానికి గురయ్యారు.

షర్మిల బస్సుమీదనుంచి ప్రసంగిస్తున్న సమయంలో బస్సుమీద ఇంకా అనేకమంది నాయకులు ఉన్నారు. కోడూరు సుధాకరరెడ్డి అదుపు తప్పి కింద పడిపోవడంతో.. తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన చెన్నైలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ.. మంగళవారం ఆయన మరణించారు. రాజకీయ యాత్రల్లో అదొక విషాదం అయితే.. షర్మిల నిన్న ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించడం మరో విషాదం. ప్రకాశం జిల్లా యాత్రలో  కృష్ణమూర్తి అనే వ్యక్తి షర్మిల సభకు వచ్చిన జనం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

గ్రహాలు వక్ర దృష్టి చూస్తున్నాయని, శని పట్టిందని అనడం కరెక్టు కాదు గానీ.. కార్యక్రమ నిర్వహణలో ఓ పద్ధతి ప్రకారం కాకుండా, వైకాపా అరాచకంగా వ్యవహరిస్తుందనడానికి ఇవి ఉదాహరణలు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. షర్మిల ప్రసంగం సాగుతున్న సమయంలో ముఖ్య నాయకులు కాకుండా.. అనేక మంది.. చాలా ఇరుకుగా టాప్‌ మీదకి ఎక్కి కూర్చోవడం అలా.. లెక్కకు మిక్కిలిగా అనుమతించడం వల్లనే సుధాకరరెడ్డి ప్రమాదం జరిగింది. దానికి పార్టీ బాధ్యత వహించాల్సిందే తప్ప.. వారి ఖర్మానికి వదిలేయడం సరి కాదు. అలాగే.. జనం తొక్కిసలాటలకు కూడా నిర్వాహకులకు తప్పకుండా బాధ్యత ఉంటుంది. ఇలాంటి లోపాలను చక్కదిద్దుకుంటే ముందుముందు జనంలో అసంతృప్తి రాకుండా ఆమె యాత్ర సాగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు