ఖానా పూర్ కాదు కవితా పూర్

ఖానా పూర్ కాదు కవితా పూర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకి.. ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఓ జిల్లాకు నేత పేరు పెట్టొచ్చు. వీధులకూ పెట్టొచ్చు. కావాలంటే రాష్ట్రమంతా నేతల విగ్రహాలు కట్టించొచ్చు. ఇవన్నీ మనం చూసినవే. కానీ ఏకంగా ఓ ఊరి ప్రజలే స్వచ్ఛందంగా తమ ఊరి పేరును కవితాపూర్ గా పెట్టుకోవడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
        
కవిత మొదట్నుంచీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. బతుకమ్మకు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మలు ఆడొచ్చారు. ఢిల్లీలో గులాబీ గళం వినిపిస్తున్నారు. కేసీఆర్ దీక్ష చేస్తున్నప్పుడు హిందీ ఛానెళ్లకు అనర్గళంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ ఇంతకీ కవిత ఏం చేసి ప్రజల మనసుల గెలుచుకున్నారో.. తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.
    
కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కడతామన్నారు. కట్టారా. చంద్రబాబు అమరావతి నిర్మిస్తాం అన్నారు. నిర్మించారా. మోడీ విదేశాల నుంచి నల్లధనం తెచ్చి మన అకౌంట్లలో వేస్తామన్నారు. వేశారా. లేదే. అలాగే కవిత కూడా ఓ గ్రామంలో జనాలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. అంతే దానికే వాళ్లు ఫ్లాటైపోయారట.
        
కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని ఖానాపూర్ గ్రామపంచాయితీ శ్రీరాంసాగర్ ముంపు గ్రామం. వరదలొచ్చినప్పుడల్లా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే. తమ కష్టాన్ని గ్రామస్తులు కవితతో మొరపెట్టుకుంటే.. ఆమె ఇళ్లకు హామీ ఇచ్చారు. అంతే వాళ్లంతా కలిసి తమ గ్రామం పేరు కవితాపూర్ గా మారుస్తున్నట్లు.. ఏకంగా ఊరి ఎంట్రన్స్ లో బ్యానరే పెట్టేశారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు