ఒక కడుపున పుట్టకపోయినా..

ఒక కడుపున పుట్టకపోయినా..

ఆయన పశ్చిమాన అరుణకాంతులు వెదజల్లిన సూరీడు. ఆమె ప్రపంచ యవనికపై స్త్రీశక్తికి ప్రతీక. అలాంటి మేరునగధీరులిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. బారత మాజీ ప్రధాని ఇందిరను.. క్యాస్ట్రో సోదరిగా భావించేవారు. ఇద్దరిలో కనిపించే అసాధారణ తెగువ కూడా మహానేతల్ని కలిపిందని అంటారు.
           
అలీనోద్యమం జోరుగా నడుస్తున్న రోజుల్లో ఇందిర, క్యాస్ట్రో పలుమార్లు కలుసుకున్నారు. క్యూబాలో జరిగిన సదస్సుకు ఇందిర హాజరైతే.. ఢిల్లీలో జరిగిన సదస్సుకు క్యాస్ట్రో వచ్చారు. ఇందిరను ఆత్మీయంగా హత్తుకుని.. తన సోదరి అని వ్యాఖ్యానించారు. క్యాస్ట్రో చేసిన చర్యతో మొదట ఆశ్చర్యపోయిన ఇందిర.. తర్వాత ఆనందం పట్టలేకపోయారు.
           
ఢిల్లీ అలీన సదస్సులోనే మరో గండాన్ని క్యాస్ట్రో తప్పించారు. తనకు ముందు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పాలస్తీనా మాజీ అధ్యక్షుడు అరాఫత్ అలిగి వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. అప్పుడు పెద్దమనిషి తరహాలో జోక్యం చేసుకున్న క్యాస్ట్రో.. నీకు ఇందిరపై అభిప్రాయం ఎలాంటిదని ప్రశ్నించారు. ఇందరి తన అక్కయ్య అని అరాఫత్ సమాధానం చెప్పారు. అలాంటప్పుడు తమ్ముడిలా చెప్పింది చేయమని చిటికెలో సమస్య పరిష్కరించారు.
          
భారత తొలి ప్రధాని నెహ్రూ కూడా క్యాస్ట్రోను అమితంగా అభిమానించారు. క్యాస్ట్రో క్యూబా గద్దెనెక్కిన తొలినాళ్లలోనే ఆయన్ను కలిశారు. ప్రపంచంలోనే అత్యంత సాహసిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని నెహ్రూ అంటే.. నెహ్రూ లాంటి స్ఫూర్తిదాతను చూసి తాను స్ఫూర్తి పొందానని క్యాస్ట్రో వినయంగా సమాధానమిచ్చారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు