కులాలపై బాబు హాట్ కామెంట్ !

కులాలపై బాబు హాట్ కామెంట్ !

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల డిమాండ్ ఒక‌వైపు, బీసీల ఆగ్ర‌హం మ‌రోవైపు వ్య‌క్త‌మ‌వుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహోద్యోగులు అయ్యారు. త్వరలోనే కులాల లెక్కలు తేలిపోనున్నాయంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇక ముందు తమ కుల బలం ఇంతంటూ చెప్పి బెదిరించే పరిస్థితులు ఉండవని పరోకంగా ముద్రగడ ఉదంతాన్ని ప్ర‌స్తావించారు. ఏపీ కల్లుగీత, కృష్ణ బలిజ పూసల,మేదర కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్స్‌ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. వ్యక్తుల వారీగా చేపట్టిన సర్వే తుది దశకు చేరుకుందని చెప్పిన చంద్ర‌బాబు ఈ సర్వేతో కుల సంఘాల నేతల ప్రకటనలన్నీ లెక్కిస్తే యధార్ధ జనాభాకు ఐదు రెట్ల సంఖ్య తేలుతోందని పేర్కొన్నారు.

తనకు అన్ని కులాలు సమానమేనని చంద్ర‌బాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, కాపులకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని చంద్ర‌బాబు తెలిపారు.  కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసమే జస్టిస్‌ మంజునాథ‌ కమిషన్‌ను నియమించామన్నారు. నివేదికకు అనుగుణంగా కాపులలోని పేదలకు రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తామని చంద్ర‌బాబు తెలిపారు. అలాగని ఇతరులకు ఎలాంటి అన్యాయం జరుగదన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక లాంటి వారని, వారి మేలు తానెప్పుడు మరిచిపోనని  పునరుద్ఘటించారు. కాపులకు బీసీ హోదా కల్పించిన అది అదనపు కోటా తప్ప ఉన్న రిజర్వేషన్‌ కోటాలో ఎవరికి తగ్గించేది లేదని చంద్ర‌బాబు వివ‌రించారు. ఇక కాపులకు రాజకీయ రిజర్వేషన్ల అవసరం లేదని ఇప్పటికే రాజకీయంగా వారు చాలా చైతన్యవంతంగా ఉన్నారన్నారు. జనాభాకు అనుగుణంగా చట్టసభలో, స్థానిక సంస్థలలోని పోటీ చేసి సీట్లు సాధించారని చంద్ర‌బాబు తెలిపారు. కాపులతో పాటు ఇతర అగ్రకులాలోని పేదల జీవన ప్రమాణాల పెంపుకు తాను కృతనిశ్చయంతో ఉన్నట్లు చంద్రబాబు చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు