'రేవంత్‌రెడ్డిని ప్రజలు తరిమికొడతారు'

'రేవంత్‌రెడ్డిని ప్రజలు తరిమికొడతారు'

తెలంగాణలో బేస్ కోసం టీడీపీ ట్రై చేస్తోందనడంలో సందేహంలేదు. కాంగ్రెస్ కు ఉన్నంత పట్టు కూడా తెలుగు తమ్ముళ్లకు లేకపోవడంతో టీడీపీ వ్యూహాలకు పదునుపెట్టింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఉధృతంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ ను ఓ రేంజ్ లో ఎండగట్టేస్తున్నారు. ప్రధానంగా సీఎం కేసీఆర్ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రైతుల బాగోగులు పట్టించుకోవడం లేదంటూ ధ్వజమెత్తుతున్నారు. విపక్ష నేతలపై ముందస్తుగానే విరుచుకుపడడంతో పాటూ వారి విసుర్లకు సమాధానమివ్వడంతో టీఆర్ఎస్ నేతలు దిట్టలు. ఈ క్రమంలో రేవంత్ విమర్శలపై స్పందించిన మంత్రి నాయిని నహ్సింహారెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదని, వ్యక్తిగత విమర్శలకు పాల్పడి తన స్థాయిని దిగజార్చుకోవద్దని సూచించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి ప్రజలే తరిమి కొడతారంటూ వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్న నాయిని, ప్రజాభ్యున్నతికి సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించామని, రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్న నాయిని విపక్షాన్ని దులిపేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని, రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెంబర్ వన్ ప్రభుత్వంగా నిలిచిందన్న విషయాన్ని విపక్షం గుర్తుంచుకోవాలన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు