చెదలు కొట్టేశాయన్న బదులుకు చిర్రెత్తుకొచ్చి..

చెదలు కొట్టేశాయన్న బదులుకు చిర్రెత్తుకొచ్చి..

చిన్నప్పుడు తెలుగువాచకంలో ఓ పాఠం ఉండేది. ఓ రైతు తన ఇనుప వ్యవసాయ పనిముట్లను పొరుగింటి వ్యక్తికి అప్పగించి అర్జెంటు పనిమీద ఊరెళతాడు. దురాశపరుడైన సదరు పొరుగు వ్యక్తి వాటిని అమ్మేసి.. తిరిగి వచ్చి తన పనిముట్లను అడగ్గా వాటిని ఎలుకలు కొట్టేశాయని చెప్తాడు. అతడి మోసం గ్రహించిన రైతు అతడి కుమారుడిని దాచేసి కాకి ఎత్తుకెళ్లిపోయిందని అంటాడు. ఎట్టకేలకు తప్పు తెలుసుకున్న పొరుగింటి వ్యక్తి మరోసారి మోసానికి పాల్పడకూడదని నిర్ణయించుకుంటాడు. ఈ కథంతా.. కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చేసిన నిర్వాకం వల్లే చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇటీవల రూ.కోట్లు ఖర్చు చేసిన ఆయన ఆదాయపన్ను అధికారులకు డాక్యుమెంట్లు చూపడంలో విఫలమయ్యారు. ఏమంటే.. జమాఖర్చులు రాసిన ఫైల్స్ చెదలు కొట్టాశాయని సమాధానమిచ్చారు.

సింఘ్వీ వాదనతో ఖంగుతిన్న ఆదాయపన్ను అధికారులు ఆయనకు తమదైన రీతిలో సమాధానమిచ్చారు. లెక్కలు చూపనందుకు రూ.57 కోట్లు జరిమానా విధించారు. ఇక సింఘ్వీ చెప్తున్న చెదల సంగతికి వస్తే.. వారి ఆఫీసు చుట్టు పక్కల చెదలు ఉన్న జాడే లేదు. విషయాలన్నీ బాగా పరిశీలించిన తర్వాతే భారీ పెనాల్టీతో సింఘ్వీని సన్మానించారు అధికారులు. ఈ సీనియర్ లాయర్ తన సిబ్బంది కోసం రూ.5 కోట్లు విలువ చేసే లాప్ టాప్స్ కొలుగోలు చేశారు. మూడేళ్ల క్రితం తన ఆదాయాన్ని తప్పుగా నమోదు చేసినందుకూ ఆయనకు జరిమానా విధించారు. అయితే రాజస్థాన్ కోర్టు కల్పించుకోవడం ద్వారా ఆ పెనాల్టీ నుంచి తప్పించుకున్నారు.

సింఘ్వీ తన రిషబ్ ఎంటర్ ప్రైజస్ సంస్థ కోసం రూ.35.98కోట్లు విలువ చేసే సోలార్ ప్యానెల్స్ ను కొనుగోలు చేశారు. అంతేకాక ఆయన ఖాతాలో సుమారు రూ.32కోట్ల వరకూ క్యాష్ ఉన్నట్లు ఆదాయపు పన్ను విభాగం గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఆ అకౌంట్ లోని సొమ్ముతోనే తన కార్యాలయ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని చెప్పారు సింఘ్వీ. సింఘ్వీ తనను ఎంతగా డిఫెండ్ చేసుకున్నా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ లెక్కలు చూపించకపోవడాన్ని ఇన్‌కమ్ టాక్స్ సీరియస్ గా తీసుకుంది. అందుకే తనదైన శైలిలో భారీ ఫైన్ విధించింది. పైన చెప్పుకున్న కథలో పొరుగింటి వ్యక్తి మారినా సింఘ్వీలో ఆ ఛాయలు కనిపించడంలేదు. తనపై కుట్ర జరుగుతోందని, తనను ఇరికించే యత్నాలు చేస్తున్నారని గొంతుచించుకుంటున్నారు. హైఫై ఆఫీసు నిర్వహిస్తూ ఫైళ్లు చెదలు కొట్టేశాయంటే ఎవరు మాత్రం నమ్ముతారు. ఈ విషయం సింఘ్వీ గమనిస్తే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English