'చూద్దాం.. ఇప్పుడే కాదు'

'చూద్దాం.. ఇప్పుడే కాదు'

పెద్దనోట్ల రద్దు మీద ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి? ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు ప్రకటన చేసిన తర్వాత ఆయన ఎక్కడా స్పందించింది లేదు. ఆయనే కాదు.. ఆయన పార్టీకి చెందిన నేతలు ఎవరూ కూడా పెదవి విప్పలేదు. ఇదిలా ఉంటే.. పెద్ద నోట్ల రద్దుపై తమ పార్టీ వ్యతిరేకమన్నట్లుగా ఎక్కడా వ్యవహరించని జగన్ పార్టీ.. సోమవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి మాత్రం హాజరయ్యారు. పెద్దనోట్ల రద్దుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హాజరైంది.

ఈ సమావేశానికి ముందు జగన్ పార్టీ ప్రతినిధిగా ఎంపీ మేకపాటి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన మేకపాటి.. నల్లధన నిరోధానికి తమ పార్టీ కట్టుబడి ఉందని.. పెద్దనోట్ల రద్దును కూడా స్వాగతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఓపక్కరద్దును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే మరోవైపు  రద్దుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావటం గమనార్హం. ఈ రెండు నాల్కల ధోరణి ఎవరి వ్యూహమో కానీ.. ఇది సరైన పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దనోట్ల రద్దుకు తమమద్దుతు ఉంటుందని చెబుతూనే.. వ్యతిరేక గళం వినిపిస్తున్న వారితో జతకట్టటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉండగా.. ప్రత్యేక హోదా అమలు బాధ్యత ప్రధాని మోడీ పై ఉందన్న మేకపాటి.. పార్టీ అధినేత పేర్కొన్నట్లుఎంపీల రాజీనామాకు ఇంకా సమయం ఉందన్నట్లుగా మాట్లాడారు. జగన్ చెప్పినట్లుగా ఎంపీలు రాజీనామాకు సిద్ధమేనా? అన్న ప్రశ్నకు స్పందించిన మేకపాటి.. ''చూద్దాం.. ఇప్పుడే కాదు'' అని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయంగా పేర్కొన్న కేంద్రమంత్రి వెంకయ్య వ్యాఖ్యలపై స్పందించిన మేకపాటి..అసలు హోదాను గట్టిగా డిమాండ్ చేసిందే వెంకయ్య అన్న విషయాన్ని గుర్తు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు