'బాబును అనుమానిస్తే అన్నాహాజారే అనుమానించ‌ట్లే'

'బాబును అనుమానిస్తే అన్నాహాజారే అనుమానించ‌ట్లే'

పెద్ద నోట్ల నిర్ణ‌యం దేశ రాజ‌కీయాల్లో ఎంత ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోందో...తెలుగు రాజ‌కీయాల్లోనూ అదే స్థాయిలో విమ‌ర్శ‌ల‌కు వేదిక‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తుండ‌గా.... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార-ప్ర‌తిపక్షాల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణంగా మారింది. ప్ర‌ధాన‌మంత్రి తీసుకునే నిర్ణ‌యం ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ముందే ఎలా తెలిసింద‌ని వైసీపీ నిల‌దీసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కనీస వేతన సంఘం చైర్మన్ డొక్కా మాణిక్య వరప్రసాద్ కొత్త పాయింట్ తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. దేశవ్యాప్తంగా మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తుంటే, ప్రతిపక్షం మాత్రం తన వైఖరి ఏమిటో స్పష్టం చేయలేకపోతోందని ఆక్షేపించారు.

ప్రధాని నిర్ణయంపై రోజుకోలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలకు, నల్లధనం కట్టడితో ఏమీ పాలుపోవడం లేదని డొక్కా ఎద్దేవా చేశారు. నోట్ల రద్దయ్యి వారం రోజులు గడుస్తున్నా వారి వైఖరి ఏమిటో స్పష్టం చేయలేకపోయారని, ప్రధాని నిర్ణయంపై వైసీపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని డొక్కా స్పష్టం చేశారు. పరిపాలనాదక్షత, దూరదృష్టి ఉన్న చంద్రబాబు వంటి నాయకుడు, నల్లధన రుగ్మతలపై ముందే అలోచించి ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా, వైసీపీ తప్ప పట్టడం వారి చిల్లర రాజకీయాలను బట్టబయలు చేస్తోందని, డొక్కా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నల్లధన చెలామణి వల్ల  అనర్థాలను, సమస్యలను ముందే ఊహించి చర్యలు తీసుకోవాలని, ప్రధాన మంత్రికి సూచించడం తప్పెలా అవుతుందో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డొక్కా డిమాండ్ చేశారు. పెద్దనోట్లను రద్దు చేయాలని అన్నాహజారే కూడా సూచించారని, ఈ విషయం కూడా ఆయనకు ముందే తెలుసా అని డొక్కా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే నల్లధనాన్ని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడిన సంగతి వైసీపీ గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలను, రాష్ట్ర దేశ పతనానికి దారి తీసే అంశాలను మందే పసిగట్టలేని వారు రాజకీయాల నుంచి వెంటనే తప్పుకోవాలని డొక్కా ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న పెట్టారు.

ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌కీయాల గురించి కూడా డొక్కా మాట్లాడారు. సైనికుల సర్టికల్ సైక్స్ పై కూడా తప్పుపట్టిన ఘనాపాఠీలు, ప్రజలకు ఉపయోగపడే, ఏ మంచి పనిచేసినా తప్ప పట్టడం మాత్రమే తెలిసిన రాజకీయ అజ్ఞానులు అనవసరంగా అధికార పార్టీలపై నోరు పారేసుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు. నోట్లరద్దు వల్ల బ్లాక్ మ‌నీ దారులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు మౌనంగా ఉంటున్న బండారం త్వరలోనే బయటకొస్తుందని ఆయన చెప్పారు. నీతిమయమైన రాజకీయాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. సామాన్యులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు