చంద్ర‌బాబు మూడుసార్లు అడిగాడంటున్న మూర్తిగారు

చంద్ర‌బాబు మూడుసార్లు అడిగాడంటున్న మూర్తిగారు

రాజ‌కీయాల్లోకి నిజాయితీప‌రులు, క‌మిట్మెంట్ ఉన్న‌వాళ్లు రావాల‌ని.. మార్పు తీసుకురావాల‌ని చాలామంది అంటారు. కానీ అలాంటి ఇమేజ్ ఉన్న వాళ్లు మాకొద్దీ రాజ‌కీయాలు అంటారు. ఆర్.నారాయ‌ణమూర్తి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఆయ‌న‌కు జ‌నాల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో చెప్పాల్సిన ప‌ని లేదు. సినిమా వాళ్లు చాలామందిలో లేని క‌మిట్మెంట్ ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. డ‌బ్బు కోసం కాకుండా జ‌నాలకు ఏదో మంచి చెప్పాలన్న త‌పన‌తో సినిమాలు చేస్తుంటారాయ‌న‌. ఆయ‌న లైఫ్ స్టైల్.. మాట‌తీరు అన్నింట్లోనూ సింప్లిసిటీ.. నిజాయితీ క‌నిపిస్తాయి. ఇలాంటి క‌మిట్మెంట్ ఉన్న వ్య‌క్తులు రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌ని జ‌నాల అభిప్రాయం. ఐతే నారాయ‌ణ మూర్తి మాత్రం ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని త‌న‌కు చాలా ఆఫ‌ర్లే వ‌చ్చాయ‌ని.. ఇప్ప‌టికైతే రాజకీయాల్లోకి రాలేనని అంటున్నారు. అదే స‌మ‌యంలో అంద‌రిలా ఆయ‌న రాజ‌కీయాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌ట్లేదు.


''రాజ‌కీయాల‌పై నాకు ఏహ్య భావ‌మేమీ లేదు. రాజ‌కీయాల్లోకి వ‌స్తే పొల్యూట్ అయిపోతాన‌న్న భ‌య‌మూ లేదు. మీరు మీరుగా ఉన్నప్పుడు ఎవరూ మార్చలేరు. సినిమాల్లోకి.. రాజ‌కీయాల్లోకి వెళ్తే నాశనమవుతారనేది స‌రికాదు. ఓ కమిట్‌మెంట్‌తో నిజాయతీగా ఉన్నవాళ్ల‌ను.. ఉండాలనుకునేవాళ్ల‌ను ఏదీ ప్రభావితం చేయలేదు. నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. అయినా ఏమీ మార‌లేదు. రాజ‌కీయాల్లోకి రావాల‌ని నాకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని చంద్రబాబు మూడుసార్లు అవకాశమిచ్చారు. తుని నియోజకవర్గంలో ప్రజలు నా పేరు సూచించారని జక్కంపూడి రామ్మోహనరావు గారు చెప్పడంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయమని స్వయంగా పిలిచారు. 2009లో పీఆర్పీ వాళ్లు అడిగారు. అందరికీ దండాలు పెట్టా. ఎందుకంటే, నేను సినిమా పిచ్చోణ్ణి. రాజకీయాల్లోకి వెళ్తే సినిమాల్లో ఉండకూడదు. ప్రజాసేవ అంటే దేవుడిచ్చిన వరంగా భావించాలి. తిండి.. నిద్రమినహాయిస్తే మిగతా స‌మ‌య‌మంతా జనం కోసమే ఆలోచించాలి. నేను ఇప్పుడు సినిమాల్లో ఉన్నా కాబ‌ట్టి రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేయ‌లేను. నేను ఏ రాజకీయ పార్టీ వ్యక్తినీ కాను. ప్రజల పార్టీ వ్యక్తిని'' అని తేల్చేశారు నారాయ‌ణ‌మూర్తి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు