నేతలకు రూ.2వేల నోటు గుబులు!

నేతలకు రూ.2వేల నోటు గుబులు!

భారతదేశ ఎన్నికల్లో ధన ప్రవాహం బహిరంగ రహస్యం. ఓటుకు నోటు చెల్లించడం దాదాపు ప్రతీ రాజకీయ పార్టీ చేసే పనే. ఓటర్లు కూడా తమ ఓటు అమ్ముకునేందుకు సిద్ధపడిపోయి నోటుకు చేయి చాచడం మామూలైపోయింది. అయితే ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో అనేదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకంటే పెద్ద నోట్లు రద్దవడంతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్ర నేతలకు గుబులు పట్టుకుంది. రూ.500, రూ.1000 స్థానంలో కొత్తగా రూ.2000 నోటు వచ్చింది. సాధారణంగా ఓటుకు రూ.500 నుంచి రూ.1000 చెల్లించడం పరిపాటైపోయింది. ప్రస్తుతం ఈ డిజిట్ లో కొత్తనోట్ల అందుబాటులో లేకపోయినా కొన్ని రోజుల్లో జనాల్లోకి వచ్చేస్తాయి. అయితే, ఓట్ల కొనుగోలుకు ధనాన్ని ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెట్టడం నేతలకు సాధ్యం కాకపోవచ్చు.

గత ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో ఓటు రూ. 500 నుంచి వెయ్యి వరకు పలికింది. మెజారిటి నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ. 10 నుంచి 15 కోట్ల వరకు వెచ్చించారు. అయితే ఇకపై నోటుకు రూ. 2వేల నోటు సమర్పించుకోవాలేమోనన్న భయం నేతలకు పట్టుకుంది. పెద్ద నోట్లు రద్దయ్యాయనగానే కొన్ని చోట్ల రాజకీయ నేతలు కాస్త సంబరపడ్డారు. ఓటుకు రూ. 100 లేదా రూ.200 ఇచ్చేస్తే పోతుందని అనుకున్నారు. అయితే రూ. 2 వేల నోటు రాకతో సీన్ తారుమారైంది. ఓటుకు ఏకంగా రూ.2000 చెల్లించాలేమో అన్న భయం పట్టుకుంది చాలామందికి. యూపీ లాంటి రాష్ట్రాల్లో రాజకీయ నేతలు ఓట్లకోసం విచ్చలవిడిగా ఖర్చుపెడుతుంటారు. ఆ లెక్కన ఇప్పుడు వారికి ఖర్చు తడిసి మోపడవుతుందేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు