టీడీపీలో ఆ ప్ర‌చారం బంద్‌.. బాబుకు పెరిగిన గ్రాఫ్‌!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొన్నాళ్లుగా ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌ని అయిపోయింద‌ని.. ఆయ‌న స్థానంలో కొత్త‌గా నాయ‌క‌త్వం అవ‌స‌రం అని.. పైగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అయితే.. బెట‌ర‌ని.. లేదా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు పూర్తిగా అప్ప‌గించాల‌ని.. ఇలా అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు.. విమ‌ర్శ‌లు పుంజుకున్నాయి. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు చంద్ర‌బాబు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇటీవ‌ల ఆయ‌న కుప్పంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా.. కొంద‌రు జూనియ‌ర్ ఎన్టీఆర్ రావాల‌ని.. మ‌రికొంద‌రు పార్టీ బాధ్య‌త‌ల‌ను లోకేష్‌కు అప్ప‌గించేయాల‌ని .. డిమాండ్ చేయ‌డం తెలిసిందే. అయితే.. ఆయా అంశాల‌పై చంద్ర‌బాబు మౌనం పాటించారు.

కానీ, అనూహ్యంగా తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబు ప‌ట్ల జ‌రిగిన ఘోర అవ‌మానం.. ఇప్పుడు మ‌రో రూపంలో పార్టీకి క‌లిసి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ప‌ట్ల ఉన్న వ్య‌తిరేక‌త(ఒకవేళ ఉంద‌ని అంటున్నవారి విష‌యంలో) లేద‌ని స్ప‌ష్ట‌మైపోయింద‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరును సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కూడా స్వాగ‌తించారు. చంద్ర‌బాబు సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించార‌ని.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా స‌మ‌యోచిత‌మేన‌ని అంటున్నారు. ఇక‌, పార్టీ ప‌రంగా చూసుకుంటే..ఇప్ప‌టి వ‌ర‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు నాలుగు ద‌శ‌లు ముగిశాయి. చాలా పంచాయ‌తీల్లో టీడీపీకి బ‌లం ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో ఓటు బ్యాంకు ఉన్నా కూడా నాయ‌కులు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో వైసీపీ వాటిని ఏక‌గ్రీవం చేసుకుంది.

ముఖ్యంగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు, పార్టీ పుట్టిన ఊరు.. కృష్ణాజిల్లాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ స‌త్తా చాట‌లేక పోయింది. దీనికి కేవ‌లం నాయకులు ముందుకు రాక‌పోవ‌డ‌మేన‌ని స్ప‌ష్టంగా తెలిసింది. నేత‌ల మ‌ద్య ఆధిప‌త్య పోరు.. అసంతృప్తి వంటివి త‌గ్గలేద‌ని నివేదిక‌లు కూడా అందాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై వారంతా గుర్రుగా ఉన్నార‌ని విశ్లేష‌ణులు వ‌చ్చాయి. ఆయ‌న మారితేనే పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని కూడా విశ్లేష‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు ఘ‌ట‌న ఉద్దేశ పూర్వ‌కంగా జ‌ర‌గ‌క‌పోయినా.. యాదృచ్ఛికంగా జ‌రిగినా.. నాయ‌కులు మాత్రం ముందుకు క‌దిలారు.

జిల్లాల్లోనూ టీడీపీ అదినేత చంద్ర‌బాబుకు అనుకూలంగా నాయ‌కులు రంగంలోకి దిగి ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో హోరెత్తించారు. దీంతో టీడీపీ మ‌ళ్లీ పుంజుకుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నాయ‌కుల‌ను కూడా ఈ ఘ‌ట‌న సంఘ‌టితం చేసింద‌ని.. పార్టీ బ‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని.. అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని కొంద‌రు వ‌ద్దంటున్నారంటూ.. జ‌రిగిన ప్ర‌చారానికి ఈ ఘ‌ట‌న అడ్డుక‌ట్ట వేసింద‌నే వాద‌న ఇప్పుడు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజా ఘ‌ట‌న‌తో ఈ విమ‌ర్శ‌లు,, నినాదాలు కొట్టుకుపోయాయి. పార్టీకి చంద్ర‌బాబు స‌మ‌ర్ధుడ‌ని.. ఆయ‌న నాయ‌క‌త్వం బాగుంద‌ని.. అంద‌రూ క‌లిసి మెలిసి ప‌నిచేసేలా కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటే స‌రిపోతుంద‌ని.. అంటున్నారు. మొత్తానికి చంద్ర‌బాబుకు జ‌ర‌గ‌రాని అవ‌మానం జ‌రిగినా.. పార్టీలో మాత్రం కొంత మార్పు క‌నిపించ‌డం కొత్త ఆశ‌ల వైపు పార్టీ నేత‌లను న‌డిపించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.