ట్విట్టర్ లో ట్రంప్ ను చంపేస్తామంటూ పోస్టుల వెల్లువ

ట్విట్టర్ లో ట్రంప్ ను చంపేస్తామంటూ పోస్టుల వెల్లువ

ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏదో పక్షం ఓడిపోవడం ఖాయం. అధికారంలోకి వచ్చిన వారు సంబరాల్లో మునిగిపోతే ఓడిపోయిన వారు డీలాపడి జరిగిన పొరపాట్లు, భవిష్య కార్యాచరణలాంటి అంశాలపై దృష్టి సారిస్తారు. కానీ గెలుపొందిన అభ్యర్ధి పాలన తమకు వద్దంటూ  ప్రదర్శనలకు దిగడం అరుదు. కానీ అగ్రరాజ్యం అమెరికా విషయంలో ఇదే జరుగుతోంది. అధినేతగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు సాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ఉధృత ప్రచారం  సాగుతోంది. ట్విట్టర్ లో అయితే ప్రెసిడెంట్ ను చంపేస్తామంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్ లో ఏకంగా #అస్సాసినేట్ ట్రంప్ పేరుతో అకౌంటే తెరిచారట.

ట్రంప్ తో పాటూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా హత్య చేస్తామంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ బెదిరింపులను సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాప్తు కూడా ప్రారంభించారట. పోటస్ (POTUS-ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేస్ట్స్) ను చంపుతామని బెదిరిస్తున్నవారిని గుర్తించేందుకు యత్నిస్తున్నారట. ఇదిలా ఉంటే, ట్రంప్ విజయానికి వ్యతిరేకంగా మరికొన్ని రోజుల పాటూ దేశవ్యాప్తంగా ర్యాలీలు సాగే సూచనలున్నాయి. తనపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను కొత్త అధినేత అంతగా పట్టించుకోవడంలేదు. పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో తాను గెలుపొందానని, మీడియా రెచ్చగొట్టడం వల్లే తనకు వ్యతిరేకంగా ప్రజలు ప్రదర్శనలు చేపడుతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నిరసనలు అన్యాయమని అన్నారు. ప్రదర్శనకారులపై తనదైన వ్యంగ్యాస్త్రం సంధించిన ట్రంప్..తామంతా కలిసి గర్వించే సందర్భం వస్తుందని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు