తెరవెనుక చక్రం తిప్పుతోందా ?

సరిగ్గా ఎన్నికల ముందు ఈమధ్యనే జైలు నుండి విడుదలైన వి. శశికళ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారా ? తమిళ రాజకీయాలను చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి తానే అని శశికళ ఎంత చెప్పుకున్నా సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో డీఏకే కూటమిదే అధికారం అని సర్వేలు చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు తనకు ఏమాత్రం ఆశాజనకంగా లేవని శశికళకు అర్ధమైపోయింది.

దీంతో ఏమి చేయాలో అర్ధంకాని చిన్నమ్మ చివరకు ఇటు ఏఐఏడీఎంకే కూటమి, అటు డీఎంకే కూటమిలోని అసంతృప్త పార్టీలను కూడగట్టి మూడో కూటమి ఏర్పాటు జరుగుతోంది. తృతీయ కూటమికి తెరపై నటుడు, సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) అధ్యక్షుడు శరత్ కుమార్ కనిపిస్తున్నా తెరవెనుక మాత్రం శశికళే ఉందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈమధ్యనే వీళ్ళద్దరి మధ్య భేటి జరగటమే ఈ ప్రచారానికి కారణమైంది.

తృతీయకూటమిలో చేరాల్సిందిగా ఇప్పటికే మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ కు కూడా ఆహ్వానం అందిదట. అలాగే పై రెండు కూటముల్లోని అసంతృప్త పార్టీలకు కూడా గాలం వేస్తున్నారట. ఏఐఏడీఏంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేతో పాటు మరో రెండు చిన్నపార్టీలున్నాయి. అలాగే డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలున్నాయి. 234 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో కూటముల మధ్య సీట్ల సర్దుబాటు ఎప్పుడూ సమస్యలుగానే ఉంటాయి.

ఇపుడా సమస్యపైనే మూడోకూటమి దృష్టి పెట్టిందట. సీట్ల సర్దుబాటులో అసంతృప్తులుగా ఉన్న పార్టీల అధినేతలకు గాలం వేస్తున్నట్లు సమాచారం. ఇండియా జననాయక కట్చి (ఐజెకే) పార్టీ తృతీయ కూటమిలో చేరింది. ఐజేకే తర్వాతే శరత్ కుమార్ కూడా తృతీయకూటమిలో చేరటంతో అందరు ఆశ్చర్యపోయారు. రేపో మాపో కమల్ హాసన్ తో కూడా తృతీయ నేతలు భేటీ అవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తృతీయ కూటమి అధికారంలోకి రావటం సంగతిని పక్కనపెట్టేస్తే ఏఐఏడీఎంకేని దెబ్బ కొట్టడమే శిశకళ లక్ష్యంగా అర్ధమవుతోంది. చూడాలి చివరకు ఏమవుతుందో.