నాన్నను ఫాలో కావేం జగన్

నాన్నను ఫాలో కావేం జగన్

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పరిశీలించినపుడు ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి. ఒక వ్యక్తిని విపరీతంగా ద్వేషిస్తూనే.. అదే వ్యక్తిని పొగిడేసే విలక్షణమైన కోణం వైఎస్ కు మాత్రమే సొంతం. విధానాల పరంగా ఆయన్ను ద్వేషించే వారు సైతం.. వ్యక్తిగతంగా ఆయన అనుసరించే తీరుకు మాత్రం ఫ్లాట్ అయిపోతారు. ఆయన అభిమానం గురించి.. ఆయన ట్రీట్ చేసే తీరు గురించి గొప్పలు చెప్పుకుంటారు. అది.. ఆయన అభిమానులే కాదు.. ఆయన ప్రత్యర్థులు కూడా. రాజశేఖర్ రెడ్డిని విపరీతంగా ద్వేషించే వారు సైతం ఆయనలోని కొన్ని కోణాల్ని మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించటం కనిపిస్తుంది.

ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే.. ఒక మనిషిని మొత్తంగా ఫలానా అని చెప్పేసే తీరుకు వైఎస్ మినహాయింపు. ఆయన్ను పూర్తిగా ద్వేషించే వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. విధానాల పరంగా.. సిద్ధాంతాల పరంగా ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం ఆయన్ను అభిమానించి.. గౌరవిస్తుంటారు. ఇక్కడో ఆసక్తికరమైన ఇంకో అంశాన్ని ప్రస్తావించాలి.

మీడియా వర్గానికి చెందిన ముఖ్యుల మాటల్లో దొర్లిన ఈ ఉదంతానికి విశ్వసనీయత ఎంత ఉందన్న విషయాన్ని కచ్ఛితంగా నిర్ధారించి చెప్పలేం కానీ.. ఇప్పుడు ప్రస్తావించే సమాచారాన్ని అందించిన వర్గాలు మాత్రం విశ్వసనీమైనవనే చెప్పాలి. వైఎస్ కు.. ఈనాడు రామోజీ  రావుకు మధ్యనున్న వైరం తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అంతటి ప్రత్యర్థుల మధ్య ఒకరిపై ఒకరికున్న గౌరవం చూస్తే షాక్ తినాల్సిందే.

మార్గదర్శి ఇష్యూ సమయంలో వైఎస్ తో ఇష్టాగోష్ఠిగా మీడియాకు చెందిన ప్రముఖులు కొందరు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ కేసు విషయంలో రామోజీరావు అరెస్ట్ తప్పదా? అన్న ప్రశ్నను ఒక సీనియర్ జర్నలిస్టు వైఎస్ ను నర్మగర్భంగా అడిగారు. దానికి స్పందించిన వైఎస్ అంతే నర్మగర్భంగా రామోజీ పేరు ప్రస్తావించకుండా.. ‘‘అంత పెద్దాయనకు అలాంటి పరిస్థితే వస్తే.. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా చేయం. అలాంటి పరిస్థితి రాదనే అనుకుంటున్నా. ఒకవేళ వచ్చినా.. అరెస్టు.. బెయిల్ అన్నీ ఒకేచోట పూర్తయ్యేలా చూస్తాం’’ అని చెప్పినట్లుగా చెబుతారు.
ఇది ఇక్కడితో కట్ చేస్తే.. ఊహించని రీతిలో వైఎస్ మరణం చోటు చేసుకోవటం.. దాన్ని జీర్ణించుకోవటమే తెలుగు ప్రజలకు కష్టమైన వేళ.. అందరికంటే తీవ్ర ఒత్తిడికి గురైనది మాత్రం ఈనాడు జర్నలిస్టులే. అందులోకి.. ఈ వార్తను ఎలా కవర్ చేయాలన్నది ఒక సమస్య అయితే.. వైఎస్ కు తమ పత్రికలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? అన్నది మరో సందేహం. ఎందుకంటే.. తమ పత్రిక ఛైర్మన్ కు.. వైఎస్ కు నడిచిన వైరం అక్కడ పని చేసే జర్నలిస్టులందరికి తెలిసిందే. ఇలాంటి సమయంలో.. వైఎస్ భౌతికకాయాన్ని చూసేందుకు ఆయన ఇంటికి వెళ్లాలని రామోజీ నిర్ణయించారు. ఈ సందర్భంగా తనను కలిసిన ముఖ్యలతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఒక మాట చెప్పినట్లుగా చెబుతారు.

వైఎస్ వార్తను ఎలా కవర్ చేయాలన్న దానికి రామోజీ తన అభిప్రాయం చెబుతూ.. ‘‘ మనిషి ఎలాంటి వ్యక్తి అన్నది తర్వాత. ఆయన్ను ప్రజలు ఎంతగానో అభిమానించారు. ఆరాధించారు. ప్రజల మనోభావాలకు తగ్గట్లే మన కవరేజ్ ఉండాలి. ఆయన్ను పూర్తిగా చెడ్డవాడని అనలేం. కొన్ని అంశాల్లోనే ఆయన తీరు అలా ఉంటుంది. అందుకే కదా.. పాదయాత్ర సమయంలో మనం ఆయనకు అంత కవరేజ్ ఇచ్చాం’’ అని చెప్పినట్లుగా చెబుతారు. రామోజీ లాంటి వ్యక్తినే.. వైఎస్ కు సంబంధించి కొన్ని విషయాల్లో కొంత సానుకూలత ప్రదర్శించటం.. అదే సమయంలో తనకు ప్రథమ ప్రత్యర్థి అయిన రామోజీ విషయంలో వైఎస్ వ్యవహారశైలి ఉండటం కాస్త చిత్రంగా.. మరింత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి.

ఈ విషయాల్ని పక్కన పెడితే.. వైఎస్ గురించి పరిచయం ఉన్న వారంతా మరో విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఆయన టైమంటే టైమే. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. టైం చెబితే దానికి మినిమం ఐదు నిమిషాలు ముందు ఉండాల్సిందే. భారీ బహిరంగ సభ అయినా సరే.. చెప్పిన టైంకు కనీసం ఒక్క నిమిషం ముందైనా వేదిక మీదకు వచ్చేస్తారు. ఆలస్యం అన్నది వైఎస్ డిక్షనరీలోనే కనిపించదు. కానీ.. ఆయన రాజకీయ వారసుడిగా చెప్పే జగన్ లో మాత్రం ఇలాంటివి అస్సలు కనిపించవు. తాజాగా జరిగిన జై ఆంధ్రప్రదేశ్ భారీ సభనే చూడండి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వేదిక మీదకు వస్తారని ప్రకటించారు.  కానీ.. చెప్పిన టైంకి దాదాపు రెండు గంటల ఆలస్యంగా జగన్ వేదిక మీదకు వచ్చారు. ఆయన వచ్చే వరకూ.. జగన్ వచ్చేస్తున్నారు.. వచ్చేస్తున్నారంటూ హడావుడి చేశారే కానీ ఆయన మాత్రం రాలేదు. చివరకు 4.55 గంటల సమయంలో ఆయన వేదిక మీదకు వచ్చారు. అంటే.. షెడ్యూల్  ప్రకారం రావాల్సిన సమయం కంటే 1.55 గంటలు ఆలస్యంగా వచ్చారన్న మాట. తండ్రిని తాను ఫాలో అవుతానని చెప్పే జగన్.. టైంకు హాజరు కావటం అనే విషయంలో తండ్రిని ఎందుకు ఫాలో కానట్లు? ఇదొక్కటే కాదు.. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేయటమే కాదు.. చాలా తక్కువ సమయమే ఆయన మాట్లాడతారు. వైఎస్ ప్రసంగాలన్నీ ఎలా ఉంటాయంటే.. అరే.. అప్పుడే స్పీచ్ అయిపోయిందా? మరికాసేపు మాట్లాడితే బాగుండనిపించేలా మాట్లాడతారు. మరి.. ఇలాంటివి నాన్న నుంచి జగన్ ఎందుకు నేర్చుకోనట్లు..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు