మరో ఉద్యమం ప్రారంభించనున్న అన్నా

మరో ఉద్యమం ప్రారంభించనున్న అన్నా

ప్రభుత్వ-అధికార యంత్రాంగాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా అన్నా హజారే ప్రారంభించిన ఉద్యమం భారత్ నే కాక ప్రపంచాన్నీ కదిలించింది. కరప్షన్ ను నిరసిస్తూ గాంధేయమార్గంలో ఆయన చేపట్టిన పోరు స్ఫూర్తితో దేశీయంగానే కాక విదేశాల్లోనూ నిరసనోద్యమాలు సాగాయి. అప్పటి అధికార కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన ఈ ఉద్యమం చల్లారిపోవడం, అన్నా కొద్దిగా తెరమరుగవడం జరిగిపోయింది. అన్నా మెయిన్ సినారియోలో లేకపోయినా అప్పుడప్పుడూ ప్రభుత్వాలకు టెన్షన్ పుట్టించే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నల్లధనాన్ని భారత్ కు తీసుకొచ్చే కార్యక్రమంపై అలసత్వం వద్దని సర్కార్ ను హెచ్చరిస్తూనే ఉన్నారు.

అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చిన అన్నా మరో పోరాటానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్రలో సంపూర్ణ మద్యనిషేధం కోసం ఉద్యమించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ వ్యసనం వల్ల కుటుంబాలు చెడిపోవడంతో పాటూ మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అన్నా మద్య నిషేధం కోసం పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను దాదాపుగా సిద్ధంచేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు సమర్పిస్తామని చెప్పారు. ఫడ్నవిస్ కూడా మద్యపాన నిషేధ చట్టానికి సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ముసాయిదాను పటిష్టంగా రూపొందించేందుకు సాయం చేయాల్సిందిగా వేదికపై ఉన్న కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మాధవ్ గాడ్ బొలేను అన్నా కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు