పెద్దన్న కొత్త ‘అధిపతి’పై మీడియా చెబుతున్నదేంది?

పెద్దన్న కొత్త ‘అధిపతి’పై  మీడియా చెబుతున్నదేంది?

ప్రజల మీద మీడియా చూపించే ప్రభావం అంతాఇంతా కాదు. పైకి అలాంటిదేమీ లేదని చెప్పినా.. ఏ విషయానైన్నా నలుగురికి తెలిసేలా చేయటానికి.. ఎవరినైనా పైకి ఎత్తాలన్నా.. కింద పడేసి తొక్కేయాలన్నా మీడియాకు సాధ్యమైనంత బాగా మరెవరికీ సాధ్యం కాదని చెప్పక తప్పదు. అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతున్నదన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మొన్నటి వరకూ డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు విజయవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు భావించినప్పటికీ.. ప్రైవేటు ఈ మొయిల్స్ వ్యవహారం ఆమెను డ్యామేజ్ చేయటమే కాదు.. ఈ ఉదంతంపై ఎప్ బీఐ తాజాగా రంగ ప్రవేశం చేసిన వైనం ఆమెకు ప్రతికూలంగా మారిందని చెప్పక తప్పదు.

అయితే.. ఇది ఏ మాత్రం సరికాదని హిల్లరీ వర్గం వాదిస్తోంది. తమకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. హిల్లరీ వర్గం చెప్పినంత సులువుగా పరిస్థితులు ఏమీ లేవన్న వాదనను ట్రంప్ వర్గం వాదిస్తోంది. ఇలా.. రెండు వర్గాలు ఎక్కడా.. ఏ మాత్రం తగ్గని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. వీరిద్దరిలో ఎవరు విజయం సాధించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఏం చెబుతున్నాయన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. వివిధ మీడియా సంస్థలు విజేత విషయంలో భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేసినా.. ఒక్క విషయంలో మాత్రం అందరూ ఒకే మాట చెప్పటం గమనార్హం. అదేమంటే.. తొమ్మిది రాష్ట్రాల ఓటర్లు అమెరికా అధ్యక్షుడ్ని డిసైడ్ చేస్తారని చెబుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడ్ని డిసైడ్ చేయటంలో కీలకంగా మారతాయన్న రాష్ట్రాల్ని చూస్తే.. ఫోరిడా.. ఒహయో.. సెవెడా.. పెన్సిల్వేనియా.. మిచిగన్.. కొలరాడో.. వర్జీనియా.. అయోవా.. న్యూహ్యాంప్ షైర్ లుగా చెబుతున్నారు.

అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. ఈ తొమ్మిది రాష్ట్రాల్లోనే 120 ఓట్లు ఉండటం గమనార్హం. అందుకే.. విజేతను డిసైడ్ చేసే విషయంలో ఈ తొమ్మిది రాష్ట్రాలే కీలకంగా చెప్పక తప్పదు. మీడియా సంస్థల్లో ప్రముఖ మీడియా సంస్థల విషయానికి వస్తే మాత్రం.. విజేత విషయంలో ట్రంప్ తో పోలిస్తే హిల్లరీ వైపే మొగ్గు ప్రదర్శించటం స్పష్టంగా కనిపిస్తోంది.

సీఎన్ ఎన్ తాజా అంచనా ప్రకారం హిల్లరీకి 268 ఎలక్టోరల్ ఓట్లు గెలిచే వీలుంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలంటే 270 సీట్లు అవసరం. ఇక.. ట్రంప్ కు మాత్రం 204 ఎలక్టోరల్ ఓట్లు రావటం ఖాయమని.. కాకుంటే 66 ఓట్లవిషయంలో మాత్రం హోరాహోరీ తప్పదు. గడిచిన రెండు వారాల్లో హిల్లరీతో పోలిస్తే ట్రంప్ కాస్తంత ఆధిక్యత సాధించినట్లుగా చెబుతోంది. రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం ట్రంప్ కంటే హిల్లరీ 1.6 శాతం ఓట్ల అధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో న్యూయార్క్ టైమ్స్ అంచనా ప్రకారం హిల్లరీ క్లింటన్ కు గెలుపు అవకాశాలు 67.8 శాతంగా పేర్కొంది. ఇక.. బీబీసీ నిర్వహించిన పలు సర్వేల సరాసరి తీసుకుంటే.. ట్రంప్ కంటే హిల్లరీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతోంది. హిల్లరీకి 46 శాతం ఉంటే.. ట్రంప్ నకు 44 శాతం గెలుపు అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.  వాషింగ్టన్ పోస్టు అంచనా ప్రకారం హిల్లరీకి 97.9 శాతం విజయవకాశాలు ఉన్నట్లుగా తేల్చి చెబుతోంది. వీటితో పాటు ఫైవ్ థర్టీ ఎయిట్.. టాకింగ్ పాయింట్ మెమోలు కూడా హిల్లరీకి ఒకటి నుంచి మూడుపాయింట్ల అధిక్యతను కట్టబెట్టటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు