'ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే వైసీపీకి 160 సీట్లు'

'ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే వైసీపీకి 160 సీట్లు'

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉన్న‌ప్ప‌టికీ హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తే చంద్ర‌బాబు అందుకు వంతపాడారని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నిర్వాకంతో రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని విజ‌య‌సాయి మండిప‌డ్డారు.  విశాఖలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే, ప్రత్యేక హోదాను సాధిస్తామని తెలియచేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 175 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 158 నుంచి 160 వరకూ వైకాపా గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తాజా సర్వేల ద్వారా ఈ విషయం వెల్లడైందన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని, చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడడం లేదని తిరుమల వెంకటేశ్వరస్వామి ముందు చెప్పమనండని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన దోచుకున్న సొమ్మును విదేశాల్లో దాచుకోవడం లేదా? అని ప్రశ్నించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు సాధించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఆ ఓట్ల శాతం ఇప్పుడు 15కి పడిపోయిందని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముందుకు వచ్చే పార్టీకి తమ పార్టీ మద్దతు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కేవలం తమ పార్టీ వలనే సాధ్యమవుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.   ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ‘జై ఆంధ్రప్రదేశ్’ సభలను నిర్వహిస్తున్నామ‌ని, ప్రత్యేక హోదాపై అవసరమైతే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్ ఆదేశాలను శిరసావహిస్తామ‌ని తెలిపారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. ఇపుడు అంత‌కంటే ఎక్కువ‌గా ఏపీ సీఎం చంద్రబాబు ద్రోహం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు తన స్వార్థం కోసం హోదాను వదులు కున్నారని, చివరకు ప్రజలు నష్టపోయారని ఆయన అన్నారు. రాష్ట్రం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోడానికి చంద్రబాబే కారణమని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఈ సమస్యలు కొన్ని దశాబ్దాలపాటు రాష్ట్రాన్ని వెంటాడుతాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక‌ హోదాను, స్పెష‌ల్ ప్యాకేజీని పోల్చి చూడలేమని విజ‌య‌సాయిరెడ్డి వివరించారు. ప్రతిపక్షంగా వైకాపా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు