బీజేపీకి చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు

బీజేపీకి చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో బీజేపీ నలిగిపోతోంది. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత తీసుకునే నిర్ణయాలకు మద్దతివ్వలేక, ప్రజా వ్యతిరేకత ప్రకారం వ్యతిరేకించలేక కమళనాథుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలాగా మారిందని అంటున్నారు. పుష్కరాల సందర్భంగా హిందూ దేవాలయాల కూల్చివేతపై ఎదుర్కున్న వ్యతిరేకతనే ఇపుడు బీచ్ ఫెస్టివల్ విషయంలోనూ బీజేపీ నేతలు భరించాల్సి వస్తోంది. ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు విశాఖ బీచ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరగనున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌పై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ సంప్రదాయం, సంస్కృతికి ప్రతినిధిగా ప్రచారంలో ఉన్న తమ పార్టీ మాత్రం మౌనం వహించడాన్ని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు-ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు ప్రాతినిధ్యం వహిస్తోన్న విశాఖపట్నంలోనే ఇలాంటి ఉత్సవాలు జరగడం వింతగా ఉందంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ షకీరాతోపాటు, వివిధ దేశాల నుంచి 9 వేల మంది విదేశీ జంటలు విశాఖలో జరగనున్న లవ్ బీచ్ ఫెస్టివల్‌కు తరలిరానున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇప్పటికే మహిళా సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా రంగంలోకి దిగింది. బికినీ ఫెస్టివల్‌పై అధికార తెదేపాను తూర్పారపట్టిన వైసీపీ, బీజేపీ మౌనాన్ని కూడా ప్రశ్నించటం ఆ పార్టీ వాదులను ఇరుకునపెట్టినట్టయింది.గోవాలో గతంలో ఇదే తరహాలో బీచ్ ఫెస్టివల్ జరిగినప్పుడు బీజేపీ సహా, సంఘ్ పరివార్ వ్యతిరేకించాయి. లవర్స్‌డే రోజు పార్కుల్లో కనిపించే ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేయడం అనేది బీజేపీకి బ్రాండ్ వంటిదనే సంగతి తెలిసిందే. అలా విదేశీ సంస్కృతిని వ్యతిరేకిస్తుంటే, తాము అధికారం పంచుకుంటున్న రాష్ట్రంలోనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నప్పటికీ గమ్మున్న ఉండిపోవాల్సి వస్తోందని అంటున్నారు. అయినా ఇప్పటివరకూ తమ పార్టీ అధ్యక్షుడు హరిబాబు నుంచి ఈ ఉత్సవాలపై స్పందన రాకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.

రాజకీయంగా తెదేపాతో కలసి అధికారం పంచుకుంటున్నప్పటికీ, ఇలాంటి సంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తే ఎక్కడ మిత్రపక్షానికి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న ధోరణి తమ పార్టీ నేతలు కొందరిలో కనిపిస్తోందంటున్నారు. దీనిని వ్యతిరేకించి అడ్డుకోకపోతే తాము వాదించే హిందూ వాదంలో అర్థం, చిత్తశుద్ధి లేదన్న విషయం ప్రజలకు తెలిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా, తాము వ్యతిరేకించాల్సిన ఇలాంటి కార్యక్రమాలను, తమ మౌనం కారణంగా వైసీపీ రంగంలోకి దిగి సద్వినియోగం చేసుకుంటోందని వాపోతున్నారు. వైసీపీ కూడా సంస్కృతి గురించి ఆందోళన చేస్తే ఇక తమకెక్కడ చోటు ఉంటుందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారురు. ఈ పరిణామాలు రానున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు