ట్రంప్ అభిమానికి ఒబామా మద్దతు

ట్రంప్ అభిమానికి ఒబామా మద్దతు

మరో మూడు రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. బరిలో ఉన్న డెమోక్రాట్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు. అధ్యక్ష అభ్యర్థులు మాటల తూటాలు పేల్చుకుంటూ తలపడితే వారి మద్దతుదారులు నేరుగా ఢీకొన్న ఉదంతాలూ ఉన్నాయి. తాజాగా హిల్లరీ కోసం అధినేత బరాక్ ఒబామా నార్త్ కరోలీనాలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఒకరు ట్రంప్ కు మద్దతుగా ప్లకార్డ్ ప్రదర్శించారు. ఇది చూసిన హిల్లరీ సపోర్టర్స్ అంతా ఆయన్ను 'బూ' అంటూ హేళన చేయడం ప్రారంభించారు. హిల్లరీ..హిల్లరీ.. అంటూ నినాదాలు మొదలెట్టారు. ఈ గోల ఎక్కువైపోవడంతో ఒబామా కాస్త అసహనానికి గురయ్యారు. మందలింపుగా.. ఆగండి, ఆగండి అంటూ చాలా సార్లు సభికులకు విజ్ఞప్తి చేసి అందరినీ కూల్ చేశారు. ట్రంప్ అభిమానికి మద్దతుగా కొన్ని మాటలు పలికి నవ్వులు పూయించారు.

''అంతా వినండి, దృష్టి కేంద్రీకరించాలని చెప్తున్నా. కానీ మీరు అలా చేయడంలేదు కదా. నేనేం చెప్తున్నానో ఇప్పుడు మీరు వినండి. అంతా కూర్చుని ఓ సెకన్ మౌనంగా ఉండండి. నేను చాలా సీరియస్ గా ఉన్నాను. చెప్పేది వినండి. తన అభ్యర్ధిని సపోర్ట్ చేసే ఓ వ్యక్తి ఇక్కడ ఉన్నారు. ఆయనేం చేయడంలేదు. మీరు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు'' అని ఒబామా అన్నారు. ''మొదటిగా, మనం భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించే దేశంలో ఉన్నాం'' అని ప్రెసిడెంట్ అనగానే అంతా కరతాళధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. ''రెండోది, ఆయన సైన్యంలో పనిచేసి ఉండొచ్చు కనుక మనం అంతా ఆయన్ను గౌరవించాలి. మూడోది, ఆయన పెద్దవారు, పెద్దవాళ్లను గౌరవించడం మన ధర్మం. నాలుగోది, 'బూ' అనడం మానేసి ఓటు వేయండి'' అంటూ తనదైన రీతిలో ప్రసంగించారు ఒబామా.

తమ మద్దతుదారులను మందలిస్తూ ట్రంప్ సపోర్టర్ కు ఒబామా మద్దతుగా మాట్లాడ్డం అందరినీ ఆశ్చర్యపరించింది. సభలో మౌనంగా నిలబడిన ట్రంప్ మద్దతుదారుడి కారణంగా తమకేమీ ప్రమాదం లేదంటూ భావప్రకటనా స్వేచ్ఛను ఆయన గౌరవించిన తీరుపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ''ఫోకస్ కోల్పోతే మనం సమస్యల్లో పడతాం. ఈ ఎన్నికల సీజన్ లో జరిగింది అదే. అనవసరంగా అనేక విషయాలకు ఆవేశపడిపోయాం. కొద్దిగా రిలాక్స్ అవండి'' అని ఒబామా అనగానే సభికులంతా గొల్లుమని నవ్వేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు