అమెరికా ఎన్నిక‌ల‌పై గుంటూరులో టెన్ష‌న్ ఎందుకు..!

అమెరికా ఎన్నిక‌ల‌పై గుంటూరులో టెన్ష‌న్ ఎందుకు..!

నిజ‌మేక‌దా! అక్క‌డెక్క‌డో ఉన్న అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగితే.. ఇక్క‌డున్న గుంటూరులో టెన్ష‌న్ ఎందుకు? స‌హ‌జంగానే ఇలాంటి ప్ర‌శ్న వ‌స్తుంది. మ‌రో రెండు రోజుల్లోనే అగ్ర‌రాజ్యం అధ్య‌క్ష పీఠానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించిన రంగం సిద్ధ‌మైంది. రిప‌బ్లిక‌న్ల త‌ర‌ఫున డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాట్ల త‌ర‌ఫున హిల్ల‌రీ బ‌రిలో దిగి పోటాపోటీగా ఎన్నిక‌ల‌కు క‌ల‌ర్స్ అద్దారు. వాస్త‌వానికి హిల్ల‌రీకి కొంత పొలిటికల్ కెరీర్ ఉంది. అంతేకాదు, ఆమె కుటుంబం పాలిటిక్స్‌లో ఆరితేరింది. ఆమె భ‌ర్త క్లింట‌న్ మాజీ అధ్య‌క్షుడు. ఇక‌, ట్రంప్ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న రియ‌ల్ ఎస్టేట్ టైకూన్‌, ఎలాంటి పొలిటిక‌ల్ కెరీర్ ఈయ‌న‌కు లేదు. పైగా నోటికి ఏదొస్తే అది అనేస్తాడు అనే ప్ర‌చారం ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రిమ‌ధ్యా ఉత్కంఠ పోరు సాగుతోంది. దీంతో ఒక్క అమెరికాలోనే కాకుండా ఈ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై ప్ర‌పంచ వ్యాప్త‌గా ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా భార‌త్‌లో కూడా. ఇంకా చెప్పాలంటే ఏపీలోని రాజ‌ధాని జిల్లా గుంటూరులో మ‌రింత టెన్ష‌న్ క‌నిపిస్తోంది. ఎంద‌కంటే.. ఈ జిల్లా నుంచి వెళ్లి.. అమెరికాలో స్థిర‌ప‌డిన కొంద‌రు అక్క‌డి పాలిటిక్స్‌లో చక్రం తిప్పుతున్నారు!! అందుకే ఇప్పుడు గుంటూరులో ఓ చాయ్ దుకాణంలో చూసినా.. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పైనే చ‌ర్చ న‌డుస్తోంది. గుంటూరులోని తెనాలి, బాప‌ట్ల, కొత్త గుంటూరు, న‌ర‌సారావుపేట‌, చిల‌క‌లూరిపేట  వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అమెరికాకు త‌ర‌లి వెళ్లిన వారు అక్క‌డ వ్యాపారాలు, ఉద్యోగాల్లోనే కాకుండా పొలిటిక‌ల్‌గా కూడా రాణిస్తున్నారు.

 'తానా'లో కీలక బాధ్యతలు పోషిస్తున్న గుంటూరు ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల పూర్వ అధ్యాపకుడు కొల్లా సుబ్బారావు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేది ఎవరన్న దానిపై గుంటూరు వాసుల మధ్య చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పూర్తి అప్‌డేట్‌లో ఉంటున్నారు.

 అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు ఫోన్ చేసి మరీ తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దాదాపు అమెరికాలోని ఎన్నారైలు అంద‌రూ హిల్ల‌రీకే మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె వీసా విధానాలు వీరికి న‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ట్రంప్ ప్రాంతీయ భేదాల‌ను రెచ్చ‌గొడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. సో.. ఈ ఎన్నిక‌లు ఇంత ఉత్కంఠ‌గా మార‌డానికి కార‌ణం ఇదే అని తెలుస్తోంది. మ‌రి ఎవ‌రు విన్ అవుతారో చూడాలంటే.. మూడు రోజులు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు