అంబానీకి వేసిన ఫైన్ అక్షరాల రూ.10,380 కోట్లు

అంబానీకి వేసిన ఫైన్ అక్షరాల రూ.10,380 కోట్లు

భారతదేశ అపర కుబేరుడు.. అత్యంత శక్తివంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. ఎంతోకాలంగా నలుగుతున్న ఒక వివాదం విషయంలో తాజాగా స్పష్టత ఇవ్వటమే కాదు.. ఊహించని రీతిలో భారీ జరిమానా విధించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

కేజీ బేసిన్ లో ఓఎన్ జీసీ గ్యాస్ బ్లాక్ నుంచి అక్రమంగా సహజవాయివును లాగేసుకున్న వివాదంలో ఏకంగా రూ.10,380 కోట్ల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ తో పాటు.. దాని పార్టనర్ కంపెనీ అయిన బ్రిటీష్ పెట్రోలియం.. నికో రిసోర్సెస్ కేంద్రం డిమాండ్ నోటీసులు పంపటం మార్కెట్ వర్గాల్లోనూ..రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది.

కేజీ బేసిన్లో ఓఎన్ జీసీకి DWN-992 (కేజీ డీన్).. గోదావరి పీఎంఎల్ పేరుతో చమురు గ్యాస్ బ్లాక్ లు ఉన్నాయి. అయితే.. ఇవన్నీ రిలయన్స్ కంపెనీకి చెందిన కేజీ – డీ 6 బ్లాక్ పక్కనే ఉన్నాయి. అయితే.. రిలయన్స్ తన బ్లాక్ నుంచి గ్యాస్ లాగేసుకున్నదన్నది ఓఎన్ జీసీ ఆరోపణ. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు జస్టిస్ ఏపీ షా నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది.

ఓఎన్ జీసీ ఆరోపణపై దృష్టి సారించిన కమిటీ ఆగస్టు 29న ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం.. ఓఎన్ జీసీ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని.. గడిచిన ఏడేళ్ల వ్యవధిలో రిలయన్స్ సుమారు 338.35 మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ల గ్యాస్ ను తోడేసిన వైనాన్ని కేంద్రం లెక్క తేల్చింది. అక్రమంగా తోడేసిన గ్యాస్.. దానికి అదనంగా చేర్చాల్సిన వడ్డీ కలిపి జరిమానాను ఫైనల్ చేసిన కేంద్రం మొత్తంగా ఈ మొత్తాన్ని 1.55 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10,380 కోట్లు) గా తేల్చింది. దీన్ని రిలయన్స్ తో పాటు బీపీ సంస్థ కూడా చెల్లించాలని డిసైడ్ చేసింది. దీనిపై రిలయన్స్ న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది.

రిలయన్స్ చెల్లించాల్సిన జరిమానాను ఓఎన్ జీసీకి కాకుండా కేంద్రానికి చెల్లించాలని షా కమిటీ చేసిన సూచనపై ఓఎన్ జీసీ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే.. రిలయన్స్ లాంటి భారీ సంస్థకు దిమ్మ తిరిగిపోయేలా మోడీ సర్కారు ఇచ్చిన తాజా షాక్ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు తెర తీయనున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English