'దోషుల బెయిల్' ఇష్యూలో హైకోర్టు కీలక నిర్ణయం

'దోషుల బెయిల్' ఇష్యూలో హైకోర్టు కీలక నిర్ణయం

కీలక నిర్ణయం ఒకటి హైకోర్టు వెల్లడించింది. హత్యా నేరంతో పాటు ఇతర క్రిమినల్ నేరాల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడిన దోషులకు సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని హైకోర్టు ప్రకటించింది. దీని ప్రకారం.. తీవ్రమైన నేరాలకు పాల్పడి.. కింది కోర్టులు యావజ్జీవ శిక్షను విధించిన కేసులు అప్పీళ్లలో ఉండి.. నిందితులు ఐదేళ్ల జైలు శిక్షను అనుభవించి ఉంటే.. వారు బెయిల్ పొందేందుకు వీలుగా ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించిన అంశాల్ని చూస్తే..

అసలు ఇష్యూ ఏమిటి?

తీవ్రమైన నేరాలకు పాల్పడి.. కింది కోర్టులు దోషులుగా తేల్చి.. యావజ్జీవ కారాగార శిక్ష ఖరారైన వారికి తాజా నిర్ణయం వెసులుబాటు కల్పిస్తుంది. ఇలా శిక్షపడిన వారు తమ శిక్షల్ని సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఊరట పొందే వీలుంది. శిక్ష పడిన ధోషులు తమ అప్పీళ్లు ఐదేళ్లు గడిచిఉంటే.. జైల్లో వారి ప్రవర్తన చక్కగా ఉంటే వారు బెయిల్ పిటీషన్ దాఖలు చేసేందుకు వెసులుబాటు కలుగనుంది. పైకోర్టుల్లో అప్పీలు పెండింగ్ లో ఉంటే బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఎలాంటి నేరాలు చేసిన వారికైనా ఇది వర్తిస్తుందా?

అన్ని క్రిమినల్ నేరాలకు పాల్పడిన వారికి బెయిల్ దరఖాస్తు చేసుకోవటం కుదరదు. బందిపోట్లు.. రకరకాల ప్రయోజనాల కోసం హత్యలు చేసిన దోషులు.. కిడ్నాపర్లు.. ప్రజా సేవకుల హంతకులు.. జాతీయ భద్రతా చట్టం పరిధిలో నేరాలు చేసిన వారు.. నార్కోటిక్ డ్రగ్స్ కేసుల్లో శిక్ష పడిన వారికి బెయిల్ పై విడుదలయ్యే అవకాశం లేదు.

బెయిల్ పొందాలంటే షరతులేంటి?

కిందికోర్టుల్లో యావజ్జీవ శిక్ష పడిన ధోషులు.. పై కోర్టుల్లో అప్పీలు చేసుకొని ఉండి ఉంటే.. అలాంటి వారు ఐదేళ్లు శిక్ష అనుభవించి ఉంటే.. వారు బెయిల్ పొందేందుకు అర్హులు. ఇలాంటి వారు బెయిల్ పొందిన తర్వాత కోర్టు వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. బెయిల్ పై ఉన్నంత కాలం ప్రతి నెలా సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టి రావాల్సి ఉంటుంది.

అసలీ నిర్ణయం ఎందుకు వెలువడింది?

గుంటూరు జిల్లా భట్టిప్రోలు పోలీసు స్టేషన్లో మారణాయుధాలతో కొట్లాటకు దిగి హత్య చేసిన నేరంపై బచ్చు గోపాలకృష్ణ.. వల్లభదాసు రమేశ్ తదితరులపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన తెనాలి 11వ అదనపు సెషన్స్ జడ్జి 2011 ఏప్రిల్ 15న యావజ్జీవ కారాగార శిక్షను విధించి తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ.. వారు అదే ఏడాది హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పటి నుంచి వారి కేసు పెండింగ్ లో ఉంది. ఐదేళ్లుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారు తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంతో హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన హైకోర్టు ధర్మాసనం వారికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయాల్ని వెలువరించింది.

ఇలాంటి విషయాల్లో ఇప్పటివరకూ కోర్టులో జరుగుతున్నదేంటి?

తీవ్రమైన నేరాలు చేసి జైలుశిక్ష అనుభవిస్తూ.. అప్పీలు పెండింగ్ లో ఉన్న వారు బెయిల్ కు దాఖలు చేయటం మామూలే. అయితే.. అలాంటివాటికి బెయిల్ పిటీషన్ ను విచారణకు తిరస్కరిస్తూ నిర్ణయాలు వెలువరించేవారు. అలాంటి సంప్రదాయాన్ని తాజా తీర్పు తిరగరాసింది.

ఎందుకిలాంటి నిర్ణయం అంటే..?

ఏదైనా తీవ్ర నేరం చేసి.. అది కింది కోర్టుల్లో నిరూపితమైన యావజ్జీవ కారాగార శిక్ష కు గురైనప్పటికీ.. అప్పీలు చేసుకున్న నేపథ్యంలో.. సదరు ముద్దాయికి అనుకోని రీతిలో ఉన్నత న్యాయస్థానాలు కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సవరించిన పక్షంలో.. అంతకాలం జైల్లో మగ్గిన వారికి అన్యాయం జరిగినట్లు అవుతుంది. అలాంటిదే జరిగినప్పుడు ఒక నిరపరాదికి అన్యాయం జరిగినట్లు అవుతుంది. అయితే.. హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేని నేపథ్యంలో విచారణ జరపటం.. తీర్పులు ఇవ్వటం ఆలస్యమవుతోంది. అలాంటి వారికి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో హైకోర్టు ధర్మాసనం తాజా నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు