యూటర్న్ తీసుకుంటున్న ఎంఐఎం

యూటర్న్ తీసుకుంటున్న ఎంఐఎం

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అన్ని పార్టీలు వాటి స్టాండ్ మార్చుకుని ఏదో ఓ వైపు మారేలా చేస్తున్నాయి. కాని హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమై ఉన్న ఎంఐఎం కు ఆపరిస్థితి రాదు అనుకున్నారు అంతా. కారణం ఆ పార్టీలో తెలంగాణ, సీమాంధ్ర అంటూ భావోద్వేగాలు లేకపోవడమే, పైగా సీమాంధ్రలో ఆ పార్టీకి పెద్దగా ఆశలు లేకపోవడం. కాని చివరకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడల కారణంగా ఎంఐఎం కూడా యూటర్న్ తీసుకోకతప్పలేదు.

రెండురోజుల క్రితమే అసదుద్దీన్ నోట ఈ  సంకేతాలు వినిపించాయి. ఇన్నాళ్లు సమైక్యమైనా, ప్రత్యేకమైనా హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎంకు వచ్చే ఇబ్బంది ఏమి లేదు, విభజన తర్వాత ఏ రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్నా తమ సీట్లు తమకు భద్రం అనుకున్నాడు అసదుద్దీన్. అయితే  హైదరాబాద్ ను యూటి గా చేస్తున్నారన్న సంకేతాలు అందడంతో ఆందోళన మొదలయింది.

అలా జరిగితే హైదరాబాద్ లో ప్రజాపాలన ఉండదు, ఎంఐఎం అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలోను ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఏమీ లేదు, అంతో ఇంతో ప్రాబల్యం ఉన్నా కూడా సీట్లు గెలిచే పరిస్థితి లేదు, కేవలం హైదరాబాద్ లోనే వారు గెలిచేది, రాజకీయాల్లో ఉండేది, పైగా ఒవైసి సోదరులు హైదరాబాద్ విడిచి పెట్టి మరెక్కడా కూడా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. అంటే యుటి చేస్తే, ఎంఐఎం శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడనుందన్న మాట.

అందుకే మొన్నటి వరకు విభజనకు వ్యతిరేకంగా గళం వినిపించిన అసదుద్దీన్ ఉన్నట్టుండి మాట మార్చి హైదరాబాద్ తెలంగాణదే, దానిని తెలంగాణ నుంచి వేరు చేస్తే ఊరుకునేది లేదు అని ప్రకటన జారీ చేసారు. కారణం ఇప్పడు అటుఇటూ కాకుండా ఉంటే అసలుకే ఎసరు వస్తుంది, అలా అని సమైక్యం అంటే హైదరాబాద్ సీమాంద్రకు దక్కదన్నది అందరికి తెలిసిందే. కారణం హైదరాబాద్ ను తెలంగాణకు ఇవ్వకుండా ఉమ్మడి రాజధానో, కేంద్రపాలిత ప్రాంతమో చేయాలి, దీనిలో ఏది చేసినా ఎంఐఎం కు నష్టం. అంటే వారు బతికి బట్టకట్టాలంటే హైదరాబాద్ తెలంగాణలో ఉండాలి. అందుకే ఇప్పడు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలి అంటూ అసదుద్దీన్ ఉద్యమానికి సిద్దమవుతున్నాడు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు