జీఎస్టీతో లాభమా.. నష్టమా..?

జీఎస్టీతో లాభమా.. నష్టమా..?

చాన్నాళ్ల తర్జనభర్జనల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ పన్నురేట్లు ప్రకటించింది. చూడటానికి పైకంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. నిత్యావసరాలను తక్కువ పన్నురేటులోకి తెచ్చామని, విలాసవంతమైన వస్తువులపై కూడా ఇప్పుడున్న వ్యాట్ కంటే తక్కువ పన్నే పడుతుందని అరుణ్ జైట్లీ తియ్యగా సెలవిచ్చారు. కానీ నిజంగా సామన్యుడిపై కేంద్రం ప్రేమ కురిపించిందా.. ? జీఎస్టీ శ్లాబుల్లో మర్మమేంటి..? జిడిపిలో 50 శాతం మించి వాటా ఉన్న సర్వీసుల రంగంపై మాత్రం పన్నుల భారం పెరగనుంది. ప్రస్తుతం 15 శాతం ఉన్న సర్వీసుల పన్ను ఏకంగా 18 శాతానికి చేరనుంది.

దీనివల్ల ద్రవ్యోల్బణం భగ్గుమనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నిజానికి ఇప్పుడున్న సర్వీసు టాక్స్‌ 14 శాతం మాత్రమే. దానిపై 0.5 శాతం స్వచ్ఛ్‌ భారత సెస్‌, మరో 0.5 శాతం కృషి కల్యాణ్‌ సెస్‌ మరో 0.5 శాతం కూడా కలిపి దీనిని 15 శాతానికి చేర్చారు. ఇప్పుడిది ఏకంగా 18 శాతానికి పెరుగుతోంది. అన్ని రకాల సర్వీసులకు ఒకటే పన్ను రేటు... 18 శాతం ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ప్రజలపై భారం భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఆర్‌బిఐ కూడా జిఎ్‌సటి వల్ల స్వల్పకాలంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి ఉంటుందని గతంలోనే హెచ్చరించింది. సరుకుల రవాణా కూడా సర్వీసుల పన్ను పరిధిలోకి వస్తుంది. రవాణా చార్జీలు పెరిగితే సహజంగానే సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల్లో అత్యధిక శాతం వస్తువులను జిఎ్‌సటి నుంచి మినహాయిస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతున్నా, రవాణా చార్జీలు పెరిగితే ఈ సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. వస్తు వినియోగ సంస్కృతి విస్తరించడంతో దేశంలో రకరకాల సర్వీసులకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది.

హోటల్స్‌, రెస్టారెంట్లు, ఆన్‌లైన్‌ పేమెంట్స్‌, ట్రావెల్‌ సర్వీసులు, క్యాబ్‌ సర్వీసులు, మొబైల్‌ రీచార్జ్‌, బీమా ప్రీమియం చెల్లింపులు, డ్రై క్లీనింగ్‌, కొరియర్‌, కేబుల్‌, డిటిహెచ్‌, క్యాటరింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు చెల్లింపులు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం, స్టాక్‌ బ్రోకింగ్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సులు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌.. ఇలా చెప్పుకొంటూ వెలితే ఈ జాబితాలో 100కు పైగా సర్వీసులు తేలుతాయి. అత్యధిక శాతం సామాన్యులు నిత్యం వినియోగించుకొనేవే. వీటిపై పన్ను రేటు పెరగడం వల్ల ప్రజల జేబులు ఖాళీ కావడం తధ్యం. కొన్ని రకాల సర్వీసులనైనా పన్నుల భారం నుంచి మినహాయిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, కనీస పన్ను 5 శాతం పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాను కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఆ జాబితా వెల్లడైతేనే ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని మరింత స్పష్టంగా అంచనావేయడానికి అవకాశం ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు