సురేఖమ్మకి వేరే దారి లేదు

సురేఖమ్మకి వేరే దారి లేదు

మాజీ మంత్రి కొండా సురేఖ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీని వీడతారనే ప్రచారం జరుగగా, ఆ ప్రచారాలకు 'శుభం' కార్డు వేశారామె. పార్టీ మారబోనని, పార్టీ మారతానని వచ్చిన వార్తలలో నిజం లేదని జగన్‌ని చంచల్‌గూడా జైలులో కలిసిన అనంతరం చెప్పారు కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసులో కొండా దంపతులను లెక్క చేయడంలేదు ఆ పార్టీ 'అధిష్టానం'గా ముద్రపడ్డ కొందరు. జగన్‌ కూడా కొన్ని రోజులనుంచి కొండా దంపతుల గురించి పట్టించుకోవడంలేదని ప్రచారం జరిగింది కూడాను. అందుకే కొండా దంపతులు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జగన్‌ కోసమే మంత్రి పదవి వదులుకున్న కొండా సురేఖను దూరం చేసుకుంటే తెలంగాణలో దెబ్బ తినాల్సి వస్తుందని భావించి, వారిని బుజ్జగించడం, ఆ ప్రయత్నాలు సఫలమవడమూ జరిగాయి.

చంచల్‌గూడా జైలులో ఆ పార్టీ అధినేత జగన్‌ని కలిశాక, అసంతృప్తీ లేదు ఏమీ లేదని కొండా దంపతులు చెప్పారు. వైఎస్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పార్టీ పటిష్టత కోసం పాటుపడ్తామనీ చెప్పారు. వేరే దారి లేదు. టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళలేక, బిజెపితో కలవలేక, తిరిగి కాంగ్రెస్‌ గుమ్మం తొక్కలేక.. సురేఖమ్మకి వైకాపాలోనే సర్దుకుపోవాల్సి వచ్చినదని వినికిడి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు