పవన్ ఏలూరులోనే ఎందుకు?

పవన్ ఏలూరులోనే ఎందుకు?

పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా ఉన్న పవన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓటుహక్కు నమోదుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ కు ఓ ఇల్లు కావాలని ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏలూరును జల్లెడపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు పవన్ కు ఇల్లిస్తామని ముందుకొస్తున్నారు. పవన్ తమ ఊళ్లో నివాసం ఉంటే.. ఏలూరు రూపురేఖలే మారిపోతాయని స్థానికులు ఆనందపడుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. పవన్ ఏలూరులో ఎందుకు ఓటుహక్కు తీసుకుంటున్నారు..? అసలు పవన్ వ్యూహమేంటి..? ఏలూరులో జనసేన ఆఫీస్ పెడితే టీడీపీ పరిస్థితేంటి..?  ఈ ప్రశ్నలు మదిలోకి రాగానే తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు రేగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా సంప్రదాయంగా టీడీపీకి కంచుకోట. ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా.. గోదావరి జిల్లాలు అండగా నిలిచాయి. మధ్యలో వైఎస్ పీరియడ్ లో పట్టు కోల్పోయినా.. మొన్నటి ఎన్నికల్లో పశ్చిమగోదావరిలో 15కు 15 సీట్లు టీడీపీ వశమయ్యాయి. దీనికి పవన్ సహాయం కారణమనే వాదన లేకపోలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన పవన్, పోటీ చేయలేదు. కానీ భీమవరం సభలో కూడా పాల్గొని టీడీపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. అలాంటి పవన్ ఈసారి ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు.

పశ్చిమగోదావరి మెగా బ్రదర్స్ సొంత జిల్లా. ఇక్కడ పవన్ సామాజికవర్గం బలమూ ఎక్కువే. అలాంటిది పవన్ ఏలూరు కేంద్రంగా పాలిటిక్స్ చేసి, ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగితే.. తమకు ఎదురుదెబ్బ తప్పదేమోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ముద్రగడ ఉద్యమం, తుని ఘటనలతో టీడీపీపై కోపంగా ఉన్న కాపుల్ని తన వైపు తిప్పుకోవడమే పవన్ వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ముద్రగడ ఉద్యమం సమయంలో తాను ఏ కులానికీ స్నేహితుడ్ని కాదన్న పవన్.. ఇప్పుడు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న జిల్లాను రాజకీయ క్షేత్రంగా ఎంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు