కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కారు షికారు కన్ఫర్మ్?

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కారు షికారు కన్ఫర్మ్?

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత టీఆరెస్ ను, కేసీఆర్ ను నిర్హీతిగా విమర్శించిన కాంగ్రెస్ నేత ఎవరైనా ఉన్నారంటే అది ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి డి.కె. అరుణ ఒక్కరే అని చెప్పాలి. మిగతా నేతలు మైకులు పట్టుకుని మాటలు విసిరినా అందులో ఏదో మొహమాటం, మరేదో భయం కనిపించేవి. అరుణ మాత్రం టీఆరెస్ ను దునుమాడడంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అలాంటి అరుణ ఇప్పుడు కారెక్కబోతున్నారన్న వార్తలు కొద్దిరోజులుగా ప్రచారమవుతున్నా తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత కూడా అదే మాట చెప్పడంతో అరుణ కారు షికారు దాదాపు కన్ఫర్మని తెలుస్తోంది.

మాజీ మంత్రి డీకే అరుణ త్వర‌లోనే అధికార పార్టీలో చేర‌తార‌ని నిజామ‌బాద్ ఎంపీ కవిత ప్రక‌టించారు. ఆమె ఇప్పటికే పార్టీలో చేరాల్సి ఉంద‌ని, కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల చేర‌లేక‌పోయార‌ని ఆమె మీడియాతో వెల్లడించ‌డం తెలంగాణ కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపింది. వాస్తవానికి ద‌స‌రాకు ముందు వ‌ర‌కు డీకే – క‌విత మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచింది. అరుణ‌ను అరుంధతి సినిమాలో బొమ్మాళితో క‌విత‌ పోలిస్తే.. కేసీఆర్‌ను ప‌శుప‌తితో అరుణ పోల్చారు. వారిద్దరి మ‌ధ్య నువ్వా – నేనా అన్నట్లుగా మాటల యుద్దం సాగింది.

మరోవైపు గ‌ద్వాల‌ను జిల్లాను చేయాలంటూ డీకే అరుణ ఎన్నిసార్లు డిమాండు చేసినా టీఆరెస్, కేసీఆర్‌ పట్టించుకోలేదు. చివరకు ఆమె రాజీనామా లేఖ‌ను కూడా ఇచ్చారు. అయితే... అనూహ్యంగా  కొత్త జిల్లాల  జాబితాలో గ‌ద్వాల‌ను చేర్చడంతో ఆమె త‌న రాజీనామా ఆలోచ‌న‌ను వెన‌క్కి తీసుకున్నారు. అక్కడి నుంచి రాజకీయం మలుపు తిరిగింది. అరుణను పార్టీలోకి తేవడానికే గద్వాలను జిల్లా చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి.

అయితే నిత్యం టీఆరెస్ తో కొట్టాడిన అరుణ నిజంగానే పార్టీ మారుతారా అన్నది ఆమె చెబితేనే తెలియాలి. క‌విత చేసిన వ్యాఖ్యలు వ్యూహత్మకంగా చేసిన‌వా.. లేక ఆమెను ఇరుకున పెట్టేందుకు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌తో చేసిన‌వా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమ‌వుతున్నాయి. మరోవైపు అరుణ వంటి నేత విషయంలో కవిత స్థాయిలో వదంతులు సృష్టించకపోవచ్చన్న వాదనా ఉంది. ఏదేమైనా అరుణ దీనిపై స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు