తెలంగాణకు ఏపీ సచివాలయం ఇవ్వట్లేదా?

తెలంగాణకు ఏపీ సచివాలయం ఇవ్వట్లేదా?

కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను అనుకున్నట్లుగా కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వసతుల లేమి కారణంగా తెలంగాణ సచివాలయాన్ని కూలగొట్టి.. ఆ స్థానంలో అత్యాధునిక స్థాయిలో సరికొత్త సచివాలయాన్ని సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నా.. కేసీఆర్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. కొత్త సచివాలయం పేరుతో భారీ ఖర్చుకు తెర తీయటంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వసతుల పేరు పైకి చెబుతున్నా.. వాస్తు సరిగా లేదన్న కారణంగానే.. సచివాలయాన్ని కూలగొట్టేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.

అయితే.. కొత్త సచివాలయ నిర్మాణంలో భాగంగా తెలంగాణ సచివాలయాన్ని.. ఏపీ సచివాలయ భవనంలోకి మార్చాలన్న ప్రతిపాదన గతంలో వచ్చింది. దీనికి సంబంధించిన కసరత్తు కొంత జరిగింది కూడా. ఏపీ సచివాలయంలోని శాఖలన్నింటినీ.. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సచివాలయంలోకి మార్చేసిన నేపథ్యంలో.. ఆ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో.. ఆ భవనాల్ని తమకు అప్పగించేస్తే.. తెలంగాణ సచివాలయంలోని శాఖలన్నింటినీ ఒక్కసారిగా మార్చటంతో పాటు.. అందరికి అనువుగా ఉంటుందని భావించారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ చేత ఏపీ ముఖ్యమంత్రికి రాయబారాన్ని పంపటం.. దీనికి సానుకూలంగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించటం జరిగిపోయాయి. అయితే. ఈ మధ్యలో చోటు చేసుకున్న పరిణామాలతో.. తమ సచివాలయ భవనాన్ని తెలంగాణ సర్కారుకు అప్పగించే విషయంలో ఏపీ సర్కారు నాన్చటంతో తెలంగాణ సర్కారు పునరాలోచనలో పడింది. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించింది. మొదట్లో అనుకున్నట్లుగా.. తెలంగాణ సచివాలయంలోని శాఖల్ని.. నగరంలోని వేర్వేరు భవనాల్లోకి మార్చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 90 శాతం శాఖల కార్యదర్శులు సచివాలయానికి సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి మారాలని నిర్ణయించారు.

సీఎంవో.. సాధారణ పరిపాలనతో సహా.. కీలక విభాగాలన్నింటినీ బీఆర్కే భవనంలోకి మార్చనున్నారు. సాగునీటి పారుదల.. పంచాయితీరాజ్.. రోడ్డు.. రహదారుల శాఖ లాంటి ఇతర శాఖల్ని నగరంలోని వివిధ భవనాల్లోకి మార్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక.. తెలంగాణ సచివాలయ భవనాన్ని శాఖలు ఖాళీ చేయాల్సిన తేదీల్ని ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా నవంబరు 10 నాటికి తెలంగాణ సచివాలయం మొత్తంగా ఖాళీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శాఖల మార్పుకు అవసరమైన ఫైళ్లను ప్యాకేజ్ చేసే పనిని కూడా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామం చూస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థనకు విరుద్ధంగా.. ఏపీ ముఖ్యమంత్రి తమ సచివాలయ భవనాన్ని తెలంగాణకు అప్పగించకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు