మావోలు అడవుల్లో ఉండటం సరికాదంటున్న ఎర్రన్న

మావోలు అడవుల్లో ఉండటం సరికాదంటున్న ఎర్రన్న

ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు {ఏవోబీ} వద్ద జరిగిన ఎన్కౌంటర్ వామపక్ష పార్టీలు సంఘాలు తీవ్రంగా కలవరపాటుకు గురయ్యాయి. సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. మైదాన ప్రాంతాల్లో ప్రజలు ఉంటున్నందున అడవుల్లో ఉండడం సరికాదన్నారు. అందుకే మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి ప్రజా స్రవంతిలోకి రావాలని, ఎర్రజెండాలన్నీ ఏకమై ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిన తరుణమిదని కె. రామకృష్ణ ఉద్దాటించారు. ఎన్కౌంటర్పై డీజీపీ సాంబశివరావు కట్టు కథ చెబుతున్నారని, ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటరేనని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులను నిరాయుధులను చేసి మరీ చంపేశారని ఈ ఎన్ కౌంటర్పై హైకోర్డు సిట్టింగ్ జడ్డి చేత విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు లేకుండా పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. నక్సల్స్ అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలసి ప్రజాసమస్యలపై వామపక్షపార్టీలతో కలసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మైదాన ప్రాంతాల్లో ప్రజలు ఉంటున్నందున అడవుల్లో ఉండడం సరికాదని పేర్కొంటూ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వల్ల త్యాగాలు వృధా అవుతున్న విషయాన్ని గమనించాలన్నారు. దేశ-రాష్ట్ర రాజకీయాల్లో అభివృద్ధి నిరోధక శక్తులు, మతోన్మాద శక్తులు, కార్పోరేట్ల అండతో ప్రభుత్వాలు లౌకికవాదాన్ని పాతరేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మావోలు ఆలోచించుకోవాలని రామకృష్ణ సూచించారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదాపైన రామకృష్ణ ఆసక్తికరమైన సవాలు విసిరారు. ప్రత్యేక హోదాను ప్రకటించకుంటే శీతాకాలం పార్లమెంటు సమావేశాల తర్వాత తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడం సరికాదని వైసీపీ కంటే ఎన్నికల హామీని విస్మరించిన బీజేపీ తమ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, టీడీపీ సహాయం తీసుకొని ఏ ఒక్కరు గెలిచినా తాము ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోతామని రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో ఒక్క బీజేపీ మాత్రమే ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చి తీరా గెలిచిన తర్వాత మాట మార్చడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రతిపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు కోరుతుంటే కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని సీఎం సహా ఏపీకి చెందిన కేంద్రమంత్రులు కోరడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్యాకేజీనే మహాద్భాగ్యమంటూ కేంద్రాన్ని అడుక్కోవడం ఏమిటి? అని రామకృష్ణ ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధం కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆత్మాభిమానాన్ని కేంద్రం వద్ద పణంగా పెడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత పేరుతో సీఎం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు