ఇండియాకు చైనా వార్నింగ్

ఇండియాకు చైనా వార్నింగ్

చైనా ఉత్ప‌త్తుల‌ను భార‌త్ లో నిషేధించాల‌న్న ప్ర‌చారం భారీగా పెరుగుతుండ‌డంతో చైనా మండిప‌డుతోంది. తాజాగా ఆ దేశం ఏకంగా హెచ్చ‌రిక‌లే జారీ చేసింది.  త‌మ వ‌స్తువుల‌ను  భార‌త్‌లో నిషేధిస్తే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపడ‌మే కాకుండా, పరస్పర పెట్టుబడులను సైతం ఇది దెబ్బతీస్తుందని హెచ్చ‌రించింది.  ఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్ దీనిపై తాజాగా స్పందించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న త‌మ దేశ‌ కంపెనీలపై ఈ అంశం ప్రభావం చూపుతుంద‌ని అన్నారు. భార‌త్, చైనా ప్రజలు ఇది కోరుకోవడం లేద‌ని.. ఒక వేళ నిషేధం విధిస్తే రెండు దేశాల సంబంధాల‌పై తీవ్ర ప్ర‌భావం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

దక్షిణాసియాలో చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన భార‌త్ ఆ దేశ వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డంలో అంద‌రికంటే ముందుంది. అయితే.. కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాతో భార‌తీయులు చైనా ట‌పాసుల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిస్తున్నారు. ఒక్క ట‌పాసులే కాదు అన్ని ర‌కాల చైనా వ‌స్తువుల‌నూ బ్యాన్ చేయాలంటూ ఆన్ లైన్ పిటీష‌న్లూ ప‌డుతున్నాయి. దీంతో ఆందోళ‌న చెందుతున్న చైనా ఇక లాభం లేద‌ని బెదిరింపుల‌కు దిగుతోంది.

కాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ఏ ర‌కంగా జ‌రుగుతున్నా కూడా భార‌త ప్ర‌జ‌లు మాత్రం దీనిపై భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. ట‌పాసులకు వ‌చ్చేసరికి ఈసారి చైనా క్రాక‌ర్సు భారీగా త‌గ్గిపోయినప్ప‌టికీ మొబైల్ ఫోన్లు వంటివి మాత్రం చైనా బ్రాండ్లే ఎక్కువ‌గా అమ్ముడుతుపోతున్నాయి. షియామీ సంస్థ‌కు చెందిన రెడ్ మీ ఫోన్లకు ఆన్ లైన్ మార్కెట్లో విప‌రీత‌మైన గిరాకీ ఉంటోంది. అమ్మ‌కానికి పెట్టిన నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అన్న బోర్డులు క‌నిపిస్తున్నాయి. నిమిషాల్లోనే ల‌క్ష‌లాది ఫోన్ల‌ను కొంటున్న ప్ర‌జ‌లు చైనా ఉత్త‌త్తుల‌ను నిషేధించాల‌ని చేస్తున్న డిమాండ్ల వెనుక ఉన్న అవ‌గాహ‌న ఎంతో తెలియ‌డం లేదు. త‌మ వ‌స్తువుల‌ను నిషేధించాల‌న్న ప్ర‌చారం వ‌ల్ల ఇప్ప‌టికేమీ ప్ర‌భావం లేక‌పోయినా భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న ఉద్దేశంతోనే చైనా కాస్త క‌టువుగా బెదిరింపుల‌కు దిగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు